దిగిరాని సన్నాలు!
- సన్నబియ్యం సరఫరాకు మిల్లర్ల మెలిక
- రూ.90 కంటే తక్కువకు ఇవ్వలేమని స్పష్టీకరణ
- పాత స్టాక్‌పై అయోమయం
- కొత్త సరుకు కొనలేక, పాతవి అమ్మలేక ఇక్కట్లు
- ధరల బోర్డుకే పరిమితమైన ప్రభుత్వ ఆదేశాలు
- వినియోగదారులపై అదనపు భారం
నవంబర్ 3 (విజయక్రాంతి) : సన్న బియ్యం(Fine-grain rice) ధరలకు కళ్లెం వేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మిల్లర్లు(Millers), టోకు వ్యాపారులు(Traders) బియ్యం సరఫరా చేయకపోవడంతో దుకాణాల్లో పాత ధరలే కొనసాగుతున్నాయి. సివిల్ సప్లు అధికారుల తనిఖీలు(Inspections by Civil Supplies officials), కేసులు, హెచ్చరికలు ఫలితమివ్వడం లేదు. కొద్దిమంది మినహా చాలాచోట్ల ప్రభుత్వ ధరల అమలు ఊసే కనిపించడం లేదు. ఫలితంగా వినియోగదారులు అదనపు భారం మోయాల్సి వస్తోంది.
ప్రభుత్వం నిర్ణయించిన సవరించిన ధరలకు బియ్యాన్ని సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు, టోకు (హోల్‌సేల్) వ్యాపారులు సమ్మతించడం లేదు. ఈ ధరలకు సరుకు ఇవ్వలేమంటూ ఏకంగా సరఫరానే నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి, చాలామంది చిల్లర వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పాత, అధిక ధరలకు బియ్యాన్ని విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే ఆరు ప్రముఖ నాణ్యమైన బియ్యం రకాలకు గరిష్ట చిల్లర ధరలను ఖరారు చేసింది.
బీపీటీ, కేఎన్ఎం రకాలు కిలోకు రూ.66 చొప్పున 25 కిలోల బ్యాగుకు రూ.716, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాకు రూ.74 చొప్పున 25 కిలోల బ్యాగుకు రూ.1,924, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలు కిలో రూ.79 చొప్పున 25 కిలోల బ్యాగుకు రూ. 2,054 ధర నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ హెచ్చరించినప్పటికీ, మెజారిటీ వ్యాపారులు ఈ ధరల పట్టికను బేఖాతరు చేస్తున్నారు.
ప్రభుత్వం నియంత్రిం చిన ఈ రకాలను పక్కన పెట్టి, ఇతర రకాల బియ్యాన్ని భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పైగా, ప్రభుత్వం ధరలు తగ్గించిన బీపీటీ, కేఎన్ఎం వంటి రకాలను మిల్లర్లు మార్కెట్లోకి రాకుండా దాచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరా బాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా ధరల బోర్డులు వెలిసినప్పటికీ, మెజారిటీ దుకాణాల్లో పాత ధరల దందానే నడుస్తోంది.
నష్టాల భయం
ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి మాట్లాడుతూ, ‘మిల్లర్లు, టోకు వ్యాపారులు కొత్త ధరలకు బియ్యం సరఫరా చేయడం లేదు. హెచ్ఎంటీ, జేఎస్ఆర్, కౌ బ్రాండ్, మాతయ్య, కర్నూల్ సోనామసూరి లాంటి ఒరిజినల్ బియ్యాన్ని కిలో రూ.90 నుంచి రూ.96 కంటే తక్కువకు ఇవ్వలేమని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వ్యాపారి స్పందిస్తూ.. ఇప్పటికే పాత, అధిక ధరలకు మిల్లర్ల నుంచి భారీగా స్టాక్ కొనుగోలు చేశామని, ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వం ధరలు తగ్గిస్తే పాత స్టాక్‌ను తక్కువ ధరకే అమ్మి నష్టపోవాల్సి వస్తుందని, అది తమవల్ల కాదని స్పష్టం చేశారు.
ఎస్ఆర్ నగర్‌కు చెందిన మరో రిటైల్ వ్యాపారి మాట్లాడుతూ.. మిల్లర్ల నుంచి తక్కువ ధరకే కొత్త నిల్వలు వస్తేనే తాము సవరించిన ధరలకు అమ్మగలమని, అంతవరకు పాత స్టాక్‌ను నష్టానికి అమ్మలేమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడంతో ఇటు సర్కార్, అటు బియ్యం వ్యాపారుల మధ్య సామాన్యుడే నష్టపోతున్నాడు.