సింగరేణి కార్మికులకు 34% బోనస్
ఒక్కొక్కరికి రూ. 1,53,912 n 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులకు లబ్ధి
29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్
సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తాం
ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణిని భ్రష్టు పట్టించిందే బీఆర్ఎస్.. ఇప్పుడు పోరుబాట హాస్యాస్పదం: మంత్రి శ్రీధర్‌బాబు
అక్టోబర్ 13 (విజయక్రాంతి): సింగరేణి బొగ్గు గని కార్మికులకు(Singareni coal mine workers') దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల వాటా కింద 34 శాతాన్ని.. ఒక్కొక్కరికి సగటున రూ. 1,53,912 చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికు లకు కూడా గతేడాది తరహాలోనే ఈసారి రూ.5,500 బోనస్ ప్రకటించారు.
మంగళవారం ప్రజాభవన్‌లో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో(Sridhar Babu) కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మొత్తం 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొంద నున్నారని, 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున దసరా బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు.
గతంలో మాదిరిగానే ఈ ఏడా ది కూడా సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు లాభాల వాటాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది సింగరేణి ఆర్జించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం అంటే రూ.596 కోట్లను లాభాల వాటాగా కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పర్మినెంట్ ఉద్యో గులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల కోసం కాలనీ..
సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో ఇప్పటి వరకు మైనింగ్ చేపట్టని ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువైన లేఅవుట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరిట నెహ్రూ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారన్నారు. సింగరేణి నుంచి రెవెన్యూ శాఖకు తిరిగి అప్పగించిన 5,774 ఎకరాల భూముల్లో 4,500 ఎకరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పట్టాల రూపంలో అందించారు. మిగిలిన సుమారు 1,250 ఎకరాలకు సంబంధించి జీవో నంబర్ 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించామని తెలిపారు.
ఉద్యోగాలు కోల్పోయినవారికి వన్ టైమ్ ఆప్షన్..
సింగరేణిలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేయాలని ఆదేశించినట్టు తెలిపారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 136 నుంచి గరిష్ఠంగా 170 మంది సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించామని, ఇందుకోసం ఏర్పాటు చేసిన సింగరేణి అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత రోజున మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఆయా ఆసుపత్రుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి, వీలైనంత ఎక్కువ మంది కార్మికులకు ప్రయోజనం కలిగేలా మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాలతో విధులకు హాజరుకాక ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని మానవీయంగా వ్యవహరించాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. సింగరేణి కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ కిట్స్ తప్పనిసరిగా పంపిణీ చేయాలని, కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండకూడదన్నారు. సింగరేణి ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే కార్మికుల పెర్క్స్, అలవెన్స్‌లపై ఆదాయపన్నును కూడా సంస్థ తరఫున ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు.
సింగరేణి అధికారులు, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఆక్రమిత నివాస ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ప్రాథమిక జాబితాను సిద్ధంచేస్తుందని, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన లబ్ధిదారుల సమగ్ర జాబితాను రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సింగరేణి పరిధిలోని ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు.
సామాన్య కార్మికుడు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి ఆసుపత్రుల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అవసరమైతే వైద్యుల వేతనాలు, పారితోషికాలను పెంచి నిపుణులైన వైద్యులను నియమిస్తామన్నారు. అత్యవసర వైద్యం కోసం కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.
గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు..
బొగ్గు గనులు, ఓవర్‌బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్మికులతోపాటు వారి కుటుంబాలు, స్థానిక ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ)ను చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించారు.
సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలని, ఖరీదైన పట్టణ, వాణిజ్య భూములను సోలార్ ప్లాంట్లకు వినియోగించకుండా, పట్టణాలకు వెలుపల ఉన్న నిరుపయోగ భూములు, ఓవర్‌బర్డెన్ గుట్టలను ఇందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సింగరేణి నుంచి స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని, ఇందుకు బదులుగా రెవెన్యూ భూముల్లోని నిరుపయోగ గుట్టల భూములకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ అమలులో భాగంగా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
సత్తుపల్లి, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామన్నారు. సింగరేణి సంస్థను అభివృద్ధి చేయడంతోపాటు కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత, ఆరోగ్యం, గృహవసతి వంటి అంశాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
సింగరేణి లాభాలు తగ్గడానికి బీఆర్ఎస్సే కారణం..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సింగరేణి లాభాలు తగ్గడానికి పలు కారణాలున్నాయని భట్టి వివరించారు. ముఖ్యంగా గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాక్‌లను అదనంగా సాధించడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేయడం వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
సుమారు 141 బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియలో నాడు సింగరేణి పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోలేదని, దీంతో సంస్థ వ్యాపార విస్తరణకు ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న బొగ్గు బ్లాక్‌లలో కొన్ని మూతపడుతుండటంతో ఉత్పత్తి, ఆదాయంపై ప్రభావం పడుతోందన్నారు. దాదాపు 14 బ్లాక్‌లు మూతపడిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త బ్లాక్‌లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కొత్త బ్లాక్‌ల సాధనకు చర్యలు..
సింగరేణి సంస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనపై దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్త బ్లాక్‌లను సాధించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. తాడిచెర్ల-2, కోయగూడెం బ్లాక్ -3, మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్, నైని వంటి బ్లాక్‌లను ప్రస్తావిస్తూ, కొత్త బ్లాక్‌ల సాధనతో పాటు సంస్థ వ్యాపారాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఏ మైనింగ్ సంస్థ అయినా నిరంతరం కొత్త బ్లాక్‌లను సాధిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటేనే దాని ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
మార్కెట్‌కు అనుగుణంగా బొగ్గు ధరల సర్దుబాటు..
ప్రస్తుతం బొగ్గు మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పారు. మహానది, కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థల నుంచి బొగ్గు సరఫరా అవుతోందని, ప్రైవేటు సంస్థలు కూడా తక్కువ ధరలకు బొగ్గును అందిస్తున్నాయని వివరించారు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉండటంతో కొన్ని సంస్థలు ఇతర వనరుల నుంచి బొగ్గు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా సింగరేణి బొగ్గు ధరలను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ధరలను సర్దుబాటు చేయకపోతే బొగ్గు కొనుగోలుదారులను కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా సంస్థ ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణి ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కోల్ ఇండియా కంటే మన సింగరేణి బొగ్గు ధర అధికంగా ఉందన్నారు.
విద్యుత్ సంస్థల బకాయిలపై స్పందన..
సింగరేణికి విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా భట్టి విక్రమార్క ప్రస్తావించారు. గత పదేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల బకాయిలు పేరుకుపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొత్తాలను క్రమంగా చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం సాధ్యం కాకపోయినా, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బకాయిలు ఎప్పుడు పేరుకుపోయినా, వాటిని చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థలపై ఉంటుందని స్పష్టంచేశారు.
కార్మికుల సంక్షేమాన్ని పక్కనపెట్టారు..
సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ పక్కనబెట్టిందని, తమ జేబు సంస్థగా సింగరేణిని మార్చుకున్నారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. మారుపేర్ల సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
సింగరేణిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. డిస్మిస్డ్ ఉద్యోగుల సమస్యలతోపాటు కార్మికులకు సంబంధించిన పలు సంక్షేమ అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతోపాటు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు అవసరమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించాల్సింది పోయి, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.
కారుణ్య నియామకాలను తాము చేపట్టామన్నారు. 80 శాతం స్థానికులకే కాంట్రాక్టు, ఔట్ సోరింగ్ ఉద్యోగాలిచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పర్మినెంట్ ఉద్యోగులు మరణిస్తే రూ.కోటి బీమాను, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమాను ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేం సాగర్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కోరం కనకయ్య, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాస్ నాయక్, గండ్ర సత్యనారాయణ రావు, విజయరామారావు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టర్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, లాభాల వాటాను ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
సింగరేణిని భ్రష్టు పట్టించినదే బీఆర్ఎస్
సింగరేణి సంస్థను పదేళ్ల పాటు అధికారంలో ఉండి నిర్వీర్యం చేసి, భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి పరిష్కరించలేని సమస్యలను ప్రతిపక్షంలో ఉండి ఎలా పరిష్కరిస్తారో మాజీ మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ట బీఆర్ఎస్ ముసలికన్నీరు కారుస్తుందన్నారు.
బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిన బీఆర్ఎస్ కొత్త బ్లాకులను ఎందుకు తేలేకపోయిందని ప్రశ్నించారు. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చేసిన మేలేమిటో, కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయిందో ముందుగా పోరుబాటలో వివరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదో ప్రజలకు చెప్పాలని అన్నారు. మారుపేర్ల సమస్యను పదేళ్ల పాలనలో ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు.