టోర్నీలకు సొంత డబ్బులు

04-11-2026 | 05:05am
  1. భారత బ్యాడ్మింటన్ స్టార్ల తిప్పలు
  2. నిధులు విడుదల చేయని సాయ్
  3. కోచ్‌లు లేకుండానే ఆడిన ప్లేయర్స్
  4. సాయ్ తీరుపై విమర్శల వెల్లువ

న్యూఢిల్లీ, నవంబర్ 3 : అధికారుల అలసత్వంతో యూరప్ పర్యటనలో(Trip to Europe) వరుస టోర్నీలు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు(Indian badminton players) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా హైలో ఓపెన్ టైటిల్స్ గెలిచిన సింధు, లక్ష్యసేన్ వంటి స్టార్ ప్లేయర్స్(Star Players) ఈ టోర్నీలకు తమ సొంత డబ్బులతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం వీరిద్దరే కాకుండా యూరోపియన్ దేశాల్లో జరిగిన పలు టోర్నీల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority of India)(సాయ్) నిధులు విడుదల చేయలేదు.

దీంతో ప్లేయర్స్ అందరూ ప్రయాణ, వసతి, భోజన ఖర్చులను తామే సొంతంగా భరించారు. సింధు, లక్ష్యసేన్ వంటి ప్లేయర్స్‌తో పాటు యువ షట్లర్లు సైతం ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిసింది. నాలుగు టోర్నీలను భారత షట్లర్లు అందరూ సొంత ఖర్చులతోనే ఆడారు. కొందరు ప్లేయర్లు ఈ ఖర్చులు భరించలేక తమ కోచ్‌లను వెంట తీసుకెళ్లలేకపోయారు. అస్మిత, తన్వి శర్మ వంటి వారు కోచ్‌లు లేకుండానే పాల్గొనాల్సి వచ్చింది. అక్టోబర్ 6న ఫిన్లాండ్‌లో జరిగిన ఆర్కిటిక్ ఓపెన్ ప్రారంభానికి ముందే ఈ విషయం తెలియడంతో భారత ఆటగాళ్లు షాకయ్యారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా తమకు అవకాశం లేకుండాపోయిందని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై ఒలింపిక్ విజేత పీవీ సింధు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితిని తన కెరీర్‌లో ఎప్పడూ ఎదుర్కొలేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి నిధుల కంటే ఆటపై ఫోకస్ పెట్టడమే తనకు ముఖ్యమని పీవీ సింధు తెలిపింది. ఆమె తన సొంత నిధులతో పాటు ఒలింపిక్ గోల్ క్వెస్ట్ సపోర్ట్‌తో ఈ పర్యటనను పూర్తి చేసింది.

అయితే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు సమర్పించకపోవడంతోనే నిధుల విడుదల చేయలేదని సాయ్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త రూల్స్ ప్రకారం టోర్నీ ప్రారంభానికి కనీసం 30 రోజుల ముందే ఆటగాళ్ల పేర్లతో కూడిన ప్రతిపాదనను సమర్పించాలి. అయితే ఈ కొత్త రూల్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాయ్ అధికారులు తెలిపారు. నిధుల నిలిపివేత తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించారు. ఈ ఘటనపై సాయ్ నుంచి స్పష్టత కోరుతామన్నారు.

మరిన్ని వార్తలు