రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ ఛాంపియన్షిప్
నవంబర్ 4, 5 తేదీల్లో సంగారెడ్డిలో నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ రగ్బీ అసోసియేషన్(Telangana Rugby Association) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ ఛాంపియన్షిప్(State-Level Asmita Rugby Championship) నవంబర్ 4, 5 తేదీల్లో సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీలో(Voxel University) నిర్వహించనున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ గచ్చిబౌలిలోని లైఫ్‌స్పాన్ హబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల, ప్రధాన కార్యదర్శి ఆదిత్య వుత్పల వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో తెలంగాణలోని 17 జిల్లాలకు చెందిన మొత్తం 28 జట్లు పాల్గొననున్నాయి.
అండర్ -15 విభాగంలో 16 జట్లు, అండర్ -18 విభాగంలో 12 జట్లు పోటీపడనున్నాయి. అండర్ -15 విభాగంలో ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, వనపర్తి, జనగాం, వరంగల్, యాదాద్రి, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల జట్లు పాల్గొంటాయి. అండర్-18 విభాగంలో ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, వనపర్తి, జనగాం, వరంగల్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల జట్లు పోటీపడనున్నాయి.
అస్మిత అంటే కార్యాచరణ ద్వారా మహిళలకు స్ఫూర్తినిస్తూ క్రీడా మైలురాళ్లను సాధించడం. ఇది కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా అమలవుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే బాలికలకు ఈ ఛాంపియన్షిప్ గొప్ప అవకాశమని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, క్రీడా శాఖ అధికారులు, వోక్సెన్ యూనివర్సిటీ, జిల్లా నిర్వాహకులు, కోచ్‌లు, ఇతర భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.