తొలిసారిగా ఫైబర్ గ్లాస్ కాస్టింగ్‌తో లేగదూడ కాలికి చికిత్స
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. పెంటయ్య ఆధ్వర్యంలో ఆవుదూడ విరిగిన కాలికి శనివారం ఆధునిక పద్ధతిలో విజయవంతంగా చికిత్స అందించారు. పట్టణంలో జంతుప్రేమతో ఆవులను పెంచుకుంటున్న ఓ రైతుకు చెందిన లేగదూడను ఇటీవల గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడ ముందు కాలి మడత భాగంలో ఎముక విరిగింది.
చికిత్స నిమిత్తం రైతు దానిని స్థానిక ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు. దూడను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. పెంటయ్య, అది తన శరీర బరువును సులభంగా మోయడానికి వీలుగా సాధారణ కట్టుకు బదులుగా ఆధునిక 'ఫైబర్ గ్లాస్ కాస్టింగ్' ద్వారా కట్టుకట్టారు. ఎముక త్వరగా, బలంగా అతుక్కునేలా ఈ చికిత్స చేశారు. ఉమ్మడి జిల్లాలోనే పశువులకు ఫైబర్ గ్లాస్ కాస్టింగ్‌తో కట్టు వేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ చికిత్సలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కంపాటి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.