నిధులు రాక.. శిథిలావస్థకు రైతువేదిక!
- నేటికీ అందని నిర్వహణ నిధులు
- సమస్యలు తీర్చాలని కోరుతున్న రైతులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలకు(Rythu Vedikas) నేటి వరకు నిర్వహణ నిధులు(Operational funds) సమకూరలేదు. దీంతో ఆ భవనా లు శిథిలావస్థకు చేరి రైతులకు(Farmers'), సిబ్బందికి కనీస వసతులు కూడా లేకుండా పోయా యి. రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం,ఆధునిక వ్యవసా య పద్ధతులపై అవగాహన కల్పించడం, కాలానుగుణంగా పంటల సాగుపై(Crop Cultivation) దిశా నిర్దేశం చేయడం కోసం 2021లో గత ప్రభుత్వ హయాంలో మండలంలోని క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతు వేదికలను ఏర్పాటు చేశారు.
ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల వ్యయం వెచ్చించి నిర్మించారు. అయితే వీటి నిర్వహణకు నెలకు రూ.10వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించగా,కొన్ని నెలల వరకు నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత నిర్వహణ నిధుల విడుదల నిలిచి పోయింది. జాజిరెడ్డిగూడెం మండలంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పంటల సూచనలు, సలహాలు అందించేందుకు తిమ్మాపురం, రామన్నగూడెం గ్రామాలలో రెండు రైతువేదికలను నిర్మించారు.
కొరవడిన కనీస వసతులు
తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో త్రాగునీటి వసతి లేదు, మరుగుదొడ్లు పనిచేయడం లేదు. రేకులు దెబ్బతిని వర్షం వస్తే నీరు లోపలికి వస్తుంది. కిటికీలకు తలుపులు లేకపోవడంతో దుమ్ము, ధూళితో వేదిక నిండిపోతుంది. ఫ్లోర్ కు వేసిన టైల్స్ ఊడిపోతున్నాయి. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విడుదల కాకపోవడంతో రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
కనీస వసతులు కల్పించాలి
రైతు వేదిక అంటేనే రైతులకు అండగా ఉండాలి. కానీ వేదికల్లో కనీస వసతి లేక శిధిలమవుతున్నా యి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టి, ప్రతినెల నిర్వహణ నిధులు విడుదల చేయాలి. ప్రతి రైతు వేదికలో ఖచ్చితంగా కనీస వసతులు కల్పించాలి.
బొల్లం బాలరాజు యాదవ్, రైతు