కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి
సీఎం మూడు రోజుల పర్యటనతో ప్రజా ధనం వృధా
ఆర్.మధుసూదన్ యాదవ్ మాజీ కౌన్సిలర్
కొడంగల్, నవంబర్ 10 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొడంగల్ అభివృద్ధి పనులన్నింటినీ హకీంపేటకే తరలించారనీ, కనీసం కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ గానైన ప్రకటించాలని కొడంగల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్.మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు.
మంగళవారం కొడంగల్ ఆయన మాట్లాడుతూ, కొడంగల్ రెవెన్యూ డివిజన్ ను చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని, గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో కూడా కొడంగల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పై ప్రస్తావించారని, తన మాటను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో, రెవెన్యూ డివిజన్ కూడా హకీంపేటకే తరలిస్తారనే ఊహాగానాలు కొడంగల్ ప్రజల్లో వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ గా చేయకపోతే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న కొడంగల్ ప్రాంతం సాధారణ మండల కేంద్రంగా మిగిలిపోతదనీ, కొడంగల్ కేంద్రంగా కొనసాగించాల్సిన అభివృద్ధి పనులన్నీ ఇప్పుటికే హకీంపేటకు తరలించారని అసహనం వ్యక్తం చేశారు. కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే త్వరలో భారీ ఎత్తున ఆందోళనలు మొదలు పెడతామని హెచ్చరించారు. రైతుమేళా పేరిట ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటనతో కొడంగల్ ప్రజలకు ఒనగూరిందేమీ లేదని, అంతేగాక ప్రజాధనం వృధా చేశారని, బర్త్ డే వేడుకలకు ఇంత హంగూ ఆర్భాటాలు అవసరమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు వెంకట్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.