పేదల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం!

10-11-2026 | 10:17pm

అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

మోటకొండూరులో పర్యటించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఆలేరు, నవంబర్ 10 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(MLA Beerla Ilaiah) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.. సంజీవరెడ్డికి ఎమ్మెల్యే అభినందనలు మోటకొండూరు మండలం గిరిబోయిన గూడెం గ్రామంలో ఏల్లంల సంజీవరెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు.

గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే మంచి సంకల్పంతో సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సంజీవరెడ్డిని ప్రశంసించారు. ప్రజా అవసరాల కోసం దాతలు ముందుకు రావడం గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తూ.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే పర్యటన సాగింది. వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో గిరిబోయిన గూడెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు