డప్పుల దరువులతో దద్దరిల్లిన భువనగిరి
ఆలేరు,(విజయక్రాంతి): డప్పుల దరువులతో భువనగిరి దద్దరిల్లింది.. జై బీసీ నినాదాలతో పట్టణ వీధులు హోరెత్తాయి. యువత కేరింతలు, మహిళల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు, భారీ జనసందోహం మధ్య తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత వాటా కల్పించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్ర సోమవారం 47వ రోజుకు చేరుకుంది. భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వైపు సాగిన యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. డప్పుల మోతల మధ్య యువత, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ మల్లన్నకు సంఘీభావం ప్రకటించారు.
భువనగిరి–యాదగిరిగుట్ట మార్గం జనసంద్రంగా మారగా, యాత్రలో వివిధ బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ అధికార సాధన కోసం సాగుతున్న ఈ పోరాటానికి ప్రజల నుంచి వెల్లువెత్తిన స్పందన యాత్రలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జన నీరాజనాల మధ్య మల్లన్న పాదయాత్ర ముందుకు సాగింది.