సైఫ్‌ను చంపేస్తామంటూ వార్నింగ్

19-11-2026 | 03:37pm

బాలీవుడ్ ప్రముఖ నటుడు, టాలీవుడ్‌లో 'దేవర' సినిమాతో విలన్‌గా మెప్పించిన సైఫ్ అలీఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఏకంగా చంపేస్తామంటూ హెచ్చరికలు రావడంతో ఈ వ్యవహారం (Threatening Calls) చర్చనీయాంశంగా మారింది. బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అయితే నిజంగానే అతడే ఈ బెదిరింపుల వెనుక ఉన్నాడా? లేక మరెవరైనా అతడి పేరును ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో ముంబై పోలీసులు (Mumbai Police) దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.

సైఫ్‌కు వచ్చిన తాజా బెదిరింపులు గతంలో ఆయనపై జరిగిన కత్తి దాడిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. 2025 జనవరి 16న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. అనంతరం సైఫ్‌పై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు దాదాపు ఆరు గంటలపాటు శస్త్రచికిత్స (Surgery) నిర్వహించారు. చికిత్స అనంతరం ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న సైఫ్ డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తాజాగా మరోసారి హత్య బెదిరింపులు రావడంతో సినీ పరిశ్రమలో ప్రముఖుల భద్రతపై చర్చ మొదలైంది. ఇటీవల హీరో టైగర్ ష్రాఫ్‌పై దాడి ఘటన కూడా వార్తల్లో నిలిచింది. మరోవైపు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖుల పేర్లతోనూ గతంలో బెదిరింపుల వార్తలు వెలుగులోకి వచ్చాయి.

వరుసగా సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వస్తున్నాయనే వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా బెదిరింపుల వెనుక అసలు వ్యక్తులు ఎవరు? జీషన్ అక్తర్ పేరును ఉపయోగిస్తున్నది ఎవరు? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు