కొబ్బరికాయ పండుకాదు.. నూనెగింజే

19-11-2026 | 03:25pm

ఇన్నాళ్లూ పండ్లలో ఒకటిగా భావిస్తూ వచ్చిన కొబ్బరికాయ (Coconut) విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొబ్బరికాయను పండుగా కాకుండా వ్యవసాయ నూనెగింజగా (Agricultural Oilseed) పరిగణించాలని స్పష్టం చేసింది. పండ్లు, కూరగాయల విక్రయాల కోసం కేటాయించిన మార్కెట్లలో కొబ్బరికాయల అమ్మకాలకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈ తీర్పు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 'మెసర్స్ త్రీ స్టార్ ఫ్రూట్ కంపెనీ' సాహిబాబాద్ పండ్లు, కూరగాయల మార్కెట్లో కొబ్బరికాయలు విక్రయించేందుకు అనుమతి కోరింది. అయితే మార్కెట్ నిబంధనల ప్రకారం అక్కడ కొబ్బరికాయల విక్రయాలకు అవకాశం లేదని అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో వ్యాపార సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అలోక్ మాథుర్, జస్టిస్ అమితాబ్ కుమార్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చివరకు వ్యాపారుల పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వృక్షశాస్త్ర పరంగా పచ్చి కొబ్బరి పండులా కనిపించినప్పటికీ, వాణిజ్యపరమైన వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. కొబ్బరి నుంచి నూనె తయారీకి ఎండు కొబ్బరి (Copra)ను విస్తృతంగా ఉపయోగిస్తారని పేర్కొంది. పచ్చి కొబ్బరిని పండులా తింటున్నారనే కారణంతో మొత్తం కొబ్బరి ఉత్పత్తిని పండ్ల విభాగంలోకి తీసుకురాలేమని స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టం-1964 (Agricultural Produce Market Act) కింద రాష్ట్ర ప్రభుత్వం 1995 జనవరి 30న కొబ్బరిని వ్యవసాయ నూనెగింజగా వర్గీకరిస్తూ సవరణ తీసుకొచ్చింది. ఈ వర్గీకరణను హైకోర్టు సమర్థించింది. గతంలో అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యాపారులకు ఆ మార్కెట్లో శాశ్వతంగా కొబ్బరికాయలు విక్రయించే హక్కు లభించదని స్పష్టం చేసింది.

మార్కెట్ యూజర్ ఛార్జీలు (User Charges) చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు చెప్పినా ధర్మాసనం అంగీకరించలేదు. అయితే గోవింద్‌పురంలోని ఆహార ధాన్యాల మార్కెట్లో నిర్ణీత రుసుములు చెల్లించి కొబ్బరికాయలు విక్రయించుకోవచ్చని సూచించింది. మనం పూజల్లో ఉపయోగించే కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ల కోసం తాగే కొబ్బరికాయ.. మార్కెట్ నిబంధనల ప్రకారం మాత్రం నూనెగింజల జాబితాలోనే ఉంటుందన్నమాట!

మరిన్ని వార్తలు