ఆలయాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
రూ.7.54 లక్షల ఆభరణాలు స్వాధీనం.. నిందితులపై గతంలో 33 చోరీ కేసులు
అశ్వాపురం, నవంబర్ 19 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో(Sai Baba Temple) జరిగిన చోరీ కేసును(Theft case) పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్(Arrest) చేశారు. వారి నుంచి రూ.7.54 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను(silver jewelry) స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 12, 13 తేదీల మధ్య అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాల తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలోని మూడు బంగారు పుస్తెల తాళ్లతో పాటు వెండి కిరీటాలు, చేతులు, పాదాలు, శఠగోపం తదితర వస్తువులను అపహరించారు. మొత్తం 7 కిలోల 900 గ్రాముల వెండి, 105 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డీఎస్పీ అరుణ్ కుమార్ పర్యవేక్షణలో సీసీఎస్, అశ్వాపురం పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం గొల్లగూడెం శివారులోని సీతారామ కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్, సప్కా కాంతారావు, ఊర లింగయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు.
వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల నేర చరిత్రను పరిశీలించగా షేక్ జానీపై 11, సప్కా కాంతారావుపై 14, ఊర లింగయ్యపై 8 చొప్పున మొత్తం 33 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని, సీసీఎస్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు.