సంప్రదాయ దుస్తులు.. దండారి నృత్యాలు
విద్యాలయంలో పండుగ వాతావరణం
విద్యార్థుల ప్రదర్శనలతో కన్నుల పండువగా దండారి ఉత్సవాలు
గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు
భావితరాలకు ఆదివాసీ కళల గొప్పతనాన్ని పరిచయం చేయడమే లక్ష్యం
ఇచ్చోడ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని స్థానిక విద్యాలయ పాఠశాలలో దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ప్రత్యేకంగా దండారి సంప్రదాయ నృత్యాలను విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, వాయిద్యాల నడుమ ప్రదర్శించడంతో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాఠశాలలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.
ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయ కళల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించడంతో పాటు భారతీయ జానపద కళలపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటడంతో దండారి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి.