హోంగార్డుకు రూ.40 వేల ఆర్థిక సాయం
హోంగార్డు వెల్ఫేర్ ఫండ్ నుంచి చెక్కు అందజేత
కరీంనగర్ క్రైం, నవంబర్ 7 (విజయక్రాంతి): విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హోంగార్డు ఎం డి. ముజీబ్(Home Guard M. D. Mujeeb) ప్రమాదానికి గురై చేయి విరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం(Karimnagar Police Commissioner Gouse Alam) మానవతా దృక్పథంతో స్పందించి, హోంగార్డు సంక్షేమ నిధి(Home Guard Welfare Fund) నుంచి రూ. 40,000/- ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ నెల 2వ తేదీన సైదాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు ముగించుకుని హోంగార్డు ఎండీ ముజీబ్ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, మెట్టుపల్లి వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన చేయి విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీ గౌస్ ఆలం వెంటనే స్పందించి బాధితుడికి అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం హోంగార్డ్ ఆర్ఐ జానీమియా ఆధ్వర్యంలో బాధితుడు ఎండీ ముజీబ్‌కు రూ. 40 వేల చెక్కును అందజేశారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి కష్టం వచ్చినా పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు.