జిల్లాలో 2,83,453 కుటుంబాల నమోదు లక్ష్యం..
481 ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ
జగిత్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతల పరిశీలన, డేటా ఎంట్రీ, శాఖల మధ్య సమన్వయంపై అదనపు కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల గణన సర్వే. (SEEEPAC) సర్వే ప్రకారం జగిత్యాల జిల్లాలోని 20 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 2,83,453 కుటుంబాలను పథకంలో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 385 గ్రామ పంచాయతీల్లో 385 కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో 96 కేంద్రాలు కలిపి మొత్తం 481 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కుటుంబంలో ప్రధాన సంపాదనపరులుగా ఉండి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని, బీమా పొందిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి నామినీకి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు. ఆహార భద్రత కార్డు ఉన్నవారితో పాటు, రేషన్ కార్డు లేని అర్హులు కూడా ఆధార్ ఆధారంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర జిల్లాల రేషన్ కార్డులు కలిగిన వారు కూడా సైతం సమీప శిబిరాల్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
నామినీగా 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యుడిని, పిల్లలు మైనర్లుగా ఉన్న సందర్భంలో అపాయింటీ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి అందుబాటులో ఉండాలని, ప్రజలకు సహాయంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు కూర్చునే వసతి, తాగునీరు, విద్యుత్ బ్యాకప్ కల్పించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా ప్రతిరోజూ సాయంత్రం నమోదు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డప్పు చాటింపు, పట్టణాల్లో కేబుల్ నెట్వర్క్ ద్వారా పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
నవంబర్ 19 తేది నాడు ప్రతి గ్రామంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అదే రోజు కనీసం 5-6 బీమా సభ్యత్వాలు నమోదు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సిపివో సత్యం గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.