1136 మందికి చేయూత పెన్షన్లు..
మంజూరు ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేయూత పింఛన్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ, మండల పరిధిలో మొత్తం 1,136 నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేశారు.
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 583 పెన్షన్లు, జమ్మికుంట మండల పరిషత్ పరిధిలోని 20 గ్రామాలకు 553 పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కార్యక్రమానికి హుజూరాబాద్ ఆర్డీవో జలకుమారి నాయక్ వాడి హాజరుకాగా, మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల నుంచి ఒక్కొక్క లబ్ధిదారుని చొప్పున 30 మందికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్డీవో జలకుమారి నాయక్ వాడి, మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, కమిషనర్ జి. మల్లికార్జున స్వామి చేతుల మీదుగా ఉత్తర్వులు అందజేశారు. అదేవిధంగా మండల పరిధిలోని 20 గ్రామాల నుంచి ఒక్కొక్క లబ్ధిదారుని చొప్పున 20 మందికి ఎమ్మెల్యే, ఆర్డీవో, ఎంపీడీవో ఆర్. పద్మావతి, సంబంధిత గ్రామ సర్పంచుల చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంపీఆర్ గార్డెన్లో అవసరమైన ఏర్పాట్లను ఎంపీడీవో ఆర్. పద్మావతి, మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి సమన్వయంతో చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఎంపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.