జపాన్ పాఠాలు.. జిల్లాకు అభివృద్ధి బాటలు

21-11-2026 | 12:41pm

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ నీతి ఆయోగ్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. ఆకాంక్షిత మండలాల కార్యక్రమం (Aspirational Blocks Programme) కింద నవంబర్ 15 నుంచి 21 వరకు జపాన్‌లో ఈ పర్యటన నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అధ్యయన పర్యటన ధ్రువపత్రాన్ని అందుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ అంకిత్ తన బృందంతో కలిసి ‘నెరిమా నగరంలోని టొయోటామా ప్రాథమిక పాఠశాల నుంచి నేర్చుకున్న పాఠాలు’ అనే అంశంపై సాంకేతిక, విధానపరమైన ప్రజెంటేషన్ (Presentation) ఇచ్చారు. పాఠశాల సందర్శనలో పరిశీలించిన విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ తీరును వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపునకు అనుసరించదగిన విధానాలపై చర్చించారు.

స్థానిక పాలన, ప్రజలకు ప్రభుత్వ సేవల అందజేత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై నిర్వహించిన అధ్యయన సమావేశాలు, క్షేత్రస్థాయి సందర్శనల్లోనూ కలెక్టర్ పాల్గొన్నారు. మిటో నగరంపై నిర్వహించిన కేస్ స్టడీ (Case Study) ద్వారా స్థానిక సంస్థలు ప్రజల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా సేవలు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. సోనీ సంస్థపై నిర్వహించిన అధ్యయనంలో సంస్థాగత మార్పులు, పనితీరు మెరుగుదలలో నాయకత్వ పాత్రను విశ్లేషించారు.

జపాన్‌లో అధ్యయనం చేసిన ఉత్తమ విధానాల్లో జిల్లాకు అనువైన అంశాలను గుర్తించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయనుంది. ముఖ్యంగా ఆకాంక్షిత మండలాల్లో విద్య, ఆరోగ్యం, పోషణ రంగాల్లో సేవల నాణ్యతను పెంచేందుకు ఈ పర్యటనలో పొందిన అనుభవాలు ఉపయోగపడనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాలను జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలగనుంది.

మరిన్ని వార్తలు