రాములమ్మగా రష్మిక
ఐకానిక్ పాటను మళ్లీ తెరపైకి తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి సంచలన గీతాన్ని రీక్రియేట్ (Recreate) చేయాలంటే బాధ్యత మరింత ఎక్కువ. ప్రస్తుతం ఇదే అనుభవాన్ని ఎదుర్కొంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా (Pan India) చిత్రం ‘మైసా’ కోసం 1997లో విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్‌ను కొత్తగా రూపొందించారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ (Unformula Films) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఒసేయ్ రాములమ్మ’ అనే పేరు వినగానే మొదట భయం వేసిందని చెప్పింది. ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇలాంటి ఐకానిక్ పాటను మళ్లీ రూపొందించడం పెద్ద బాధ్యతగా భావించానని తెలిపింది. ఈ పాటకు వందేమాతరం శ్రీనివాస్ గాత్రం అందించడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది. మరి అప్పట్లో సంచలనం సృష్టించిన ‘ఒసేయ్ రాములమ్మ’ పాట.. ఇప్పుడు ‘మైసా’లో ఎలాంటి మ్యాజిక్ (Magic) క్రియేట్ చేస్తుందో చూడాలి!