డిగ్రీ పాస్ కావాలా? ఇక్కడ పరీక్ష రాయండి చాలు

21-11-2026 | 12:31pm

బోథ్, నవంబర్ 21 (విజయక్రాంతి): డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ పరీక్ష రాస్తే చాలని, దగ్గరుండి మరీ పాస్ చేయిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు డిగ్రీ కళాశాలల పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ (Mass Copying) యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయా కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు (Strict Rules) అమలు చేస్తున్నప్పటికీ, పరీక్షలు ప్రారంభమైన వెంటనే మైక్రో జిరాక్స్‌లతో కూడిన జవాబులు పరీక్ష కేంద్రాలకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యాలకు దగ్గరగా ఉండే విద్యార్థులకు చిట్టీలు ఆశించిన స్థాయిలో అందుతున్నాయని, అప్పుడప్పుడు కళాశాలకు వచ్చే విద్యార్థులకు మాత్రం అంతంతమాత్రంగానే సహకారం లభిస్తోందని ప్రచారం జరుగుతోంది. మాస్ కాపీయింగ్‌కు సహకరించేందుకు కొందరు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లోని డిగ్రీ కళాశాలల పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచే హడావుడి నెలకొంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు తెచ్చుకున్న చిట్టీల్లో లేని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను బయట నుంచి పంపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కళాశాలల యాజమాన్యాలే ఉత్తీర్ణత శాతం (Pass Percentage) పెంచేందుకు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

డిగ్రీ పరీక్షల్లో పాస్ కావాలనుకునే విద్యార్థులు బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ మండల కేంద్రాల్లోని పరీక్ష కేంద్రాలను ఎంచుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లిస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మౌనం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఆరోపణలపై సమగ్ర విచారణ (Investigation) జరిపించాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు