శ్రమకు తగ్గ ప్రతిఫలం చెల్లించాలి

15-11-2026 | 05:34pm

- సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలు సరికాదు

- 20 శాతం బోనస్, కనీస వేతనాలు చెల్లించాలి 

- ఓబీ కార్మికుల సమ్మెపై సింగరేణి, లేబర్ శాఖ జోక్యం చేసుకోవాలి

- సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా

​చుంచుపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): కష్టపడి పనిచేసే కార్మికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా(CPI District Secretary S.K. Sabir Pasha) డిమాండ్ చేశారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్‌మైన్ (వీకేసీఎం) ఓపెన్‌కాస్ట్‌లో ఓవర్‌బర్డెన్ (మట్టి పని) తీసే కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ, కార్మికులకు రావాల్సిన 20 శాతం బోనస్ చెల్లించాలని, ఇతర ఓబీ కంపెనీల తరహాలో రోజుకు రూ.950 చొప్పున 26 రోజుల వేతనం, ఆదివారం డబుల్ మస్టర్, చట్టబద్ధ హక్కులు కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదని, సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలకు పాల్పడటం సరైనది కాదని హితవు పలికారు, సమ్మె చేస్తున్నారని కారణంతో నలుగురు కార్మికులను విధుల నుంచి తొలగించడం చట్ట విరుద్ధమని ఇలాంటి చర్యలు శోదా యాజమాన్యం మానుకోవాలని డిమాండ్ చేశారు.

తక్షణమే సింగరేణి యాజమాన్యం, లేబర్ శాఖ చొరవ తీసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల న్యాయపోరాటానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం అన్నయ్యగారు మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, జీ వీరస్వామి, గట్టయ్య, మార్షల్ శ్రీను, మోహన్, సత్తార్, కట్టా ఉదయ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు