మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి
– డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాలో భూముల రీసర్వే పూర్తి చేయాలి
– ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామానికి చేరాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
మణుగూరు, నవంబర్ 10 (విజయక్రాంతి): మారుమూల, సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించాలని సూచించారు. మంగళవారం మణుగూరు మండలం చిన్నరాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను అయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, అటవీ భూముల హద్దులు, భూముల విస్తీర్ణం, సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నరాయిగూడెం గ్రామ పరిధిలో మొత్తం 1,395 ఎకరాల భూమి ఉండగా, అటవీ శాఖ రికార్డుల ప్రకారం 554 ఎకరాలు అటవీ భూమిగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే నంబర్లు, రెవెన్యూ రికార్డులు, అటవీ శాఖ అభ్యంతరాల వల్ల ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.రైతుల వినతులను రికార్డుల ఆధారంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
అనంతరం గ్రామంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు, మొబైల్ నెట్వర్క్, రహదారి సౌకర్యాలపై గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.రాంనగర్ నుంచి పాములపాడు వరకు రహదారి లేక అత్యవసర వైద్య సేవలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలపగా, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... జిల్లాలో 70 కాడస్ట్రల్ గ్రామాలతో పాటు మ్యాప్లు లేని 7 నాన్ కాడస్ట్రల్ గ్రామాల్లో రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 23 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి మారుమూల, సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, చేయూత పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలన్నారు.డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాలో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ , సర్వేయర్ నరేష్ , అటవీ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.