తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
ఏ ఐ యు కె ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపుడి రాము
దమ్మపేట, నవంబర్ 09(విజయక్రాంతి): మురసు తుపాన్(Murasu Cyclone) వల్ల మండలం లో కురిసిన భారీ వర్షాల(Heavy rains) కారణంగా పంటలు నష్టపోయిన రైతు లకు నష్ట పరిహారం చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు(agricultural workers) ఉపాధి కల్పించాలని సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో దమ్మపేట పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం తహసిల్దార్ కు పలు డిమాండ్స్ తో కూడిన మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపుడి రాము, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినెపల్లి ప్రభాకర్ లు మాట్లాడుతూ మురసు తుపాన్ ప్రభావంతో దమ్మపేట మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, చేతికి అందివస్తాయనుకున్న పంటలు వర్షాల ధాటికి దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని అన్నారు.
ఇప్పటికే పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీ ఖర్చుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేసిన రైతులు పంట నష్టాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, మరోవైపు వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయి, కుటుంబాలను పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి కూలీలకు రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని అన్నారు.
ప్రభుత్వం వెంటనే తుపాన్ వల్ల నష్టపోయిన పంటలకు తక్షణమే పరిహారం ప్రకటించాలని, ప్రతి గ్రామంలో పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, నష్టపోయిన రైతులకు వరి కి ఎకరాకు 50వేలు, ఇతర పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు తక్షణమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని, రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి, బ్యాంకు ద్వారా వడ్డీ లేని పంట రుణాలు అందించాలని, రాబోయే పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ పెట్టుబడులను సబ్సిడీపై అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో ఏఐయుకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి కిషోర్, జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ, అఖిలభారత ఐక్య రైతు సంఘం పాల్వంచ డివిజన్ అధ్యక్షులు పండూరి వీరబాబు, తామా రాముడు, కుంజా కాంతారావు, తెల్లం నగేష్, బొగ్గం మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.