నెమలిపేట ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే జారె
35 లక్షలతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, త్వరలో కాలువకు ఇరువైపులా కాంక్రీట్ గోడలు
దమ్మపేట, నవంబర్ 09(విజయక్రాంతి): దమ్మపేట పంచాయతీ(Dammapeta Panchayat) పరిధిలోని నెమలిపేట గ్రామ ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayan) శ్రీకారం చుట్టారు. గ్రామంలో రెండు రోజుల క్రితం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించి కాలువపై ఉన్న పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో వర్షపు నీరు సక్రమంగా కిందకు వెళ్లక గ్రామం ముంపునకు గురవుతున్న విషయాన్ని గుర్తించారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఎమ్మెల్యే జారే చొరవతో కేవలం రెండు రోజుల్లోనే నిర్మాణానికి అనుమతులు రావడంతో సోమవారం కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
అంతేకాకుండా వర్షపు నీరు గ్రామంలోకి రాకుండా కాలువకు ఇరువైపులా పటిష్టమైన కాంక్రీట్ గోడలు నిర్మించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్, సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వనమాల సూరిబాబు, చిన్నశెట్టి గోపి, గట్ల సర్వేశర్రావు, వార్డు మెంబర్ దాసరోజు సరిత రామారావు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.