హేమచంద్రపురం రోడ్డు విస్తరణకు లైన్ క్లియర్

17-11-2026 | 05:54pm
  1. దశాబ్దాల ట్రాఫిక్ సమస్యకు చెక్....
  2. పరిష్కారం దిశగా కీలక ముందడుగు.
  3. రైల్వే భూముల అప్పగింత పూర్తి
  4. ఖమ్మం యమ్ పి రఘురామిరెడ్డి.....

కొత్తగూడెం నవంబర్ 17 విజయ క్రాంతి: 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ(Road widening) సమస్యకు తెరపడింది. ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి(MP Ramasahayam Raghurami Reddy), ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమన్వయ కృషితో, భూముల మార్పిడి ప్రక్రియ పూర్తిచేశారు. ఐదు ప్రధాన రహదారుల అభివృద్ధితో కొత్తగూడెంను ఆధునిక పట్టణంగా, ప్రధాన వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని మేయర్ మూడ్ గణేష్తెలియచేశారు.

కొత్తగూడెం పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి ,హేమచంద్రాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణకు అవసరమైన రైల్వే భూములను రెవెన్యూ శాఖకు అప్పగించే ప్రక్రియ పూర్తయింది.

సుమారు 15 నుంచి 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి, ఎంపీ రఘురామిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమన్వయ సహకారంతో రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. మంగళవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి సమక్షంలో రైల్వే భూములను రెవెన్యూ శాఖకు అప్పగించే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారి కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సమయంలో స్థానిక ప్రజలు హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పట్టణ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

ఈ ప్రక్రియలో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కీలక చొరవ చూపారని ఎంపీ తెలిపారు. రోడ్డు విస్తరణకు అవసరమైన రైల్వే భూముల సర్వే నిర్వహించడం, భూముల విస్తీర్ణం, మార్కెట్ విలువలను నిర్ధారించడం, భూముల మార్పిడికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయడంలో జిల్లా యంత్రాంగం సహకరించిందన్నారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో చర్చలు జరిపి సమస్యను వివరించగా, భూముల మార్పిడికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపిందని అన్నారు .

భూముల మార్పిడి ప్రక్రియలో భాగంగా కొత్తగూడెంలో రైల్వే శాఖకు చెందిన సుమారు 5,500 చదరపు గజాల భూమిని హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ కోసం రెవెన్యూ శాఖకు అప్పగిస్తున్నట్లు ఎంపీ వివరించారు. దీనికి ప్రతిగా ఖమ్మం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 4,500 చదరపు గజాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

ఇరు ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను సంబంధిత శాఖల ద్వారా నిర్ధారించి, భూముల మార్పిడికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వుల ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. కొత్తగూడెంలో భూముల అప్పగింత ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సమక్షంలో ఖమ్మంలోనూ రైల్వే శాఖకు భూమిని అప్పగించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.

ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, కొత్తగూడెం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ తెలిపారు. అదేవిధంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి హేమచంద్రాపురం రోడ్డు విస్తరణకు రైల్వే భూముల అవసరాన్ని వివరించగా,

భూముల మార్పిడి ప్రక్రియ వేగవంతం కావడానికి ఆయన సహకరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ, దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమన్వయంతోనే ఇన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగిందని తెలిపారు .

రోడ్డు విస్తరణ పూర్తయితే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనాల రాకపోకలు సులభతరమవుతాయని, వ్యాపార కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే అధికారులు,జిల్లా యంత్రాంగానికి ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ, హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ కొత్తగూడెం పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ రహదారి విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, రహదారి ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమన్వయ సహకారం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం, సంబంధిత శాఖల సహకారంతో రైల్వే భూముల అప్పగింత ప్రక్రియ పూర్తికావడం సంతోషకరమన్నారు.

రోడ్డు విస్తరణకు అవసరమైన భూముల సమస్య పరిష్కారమైన నేపథ్యంలో పనులను త్వరలో ప్రారంభించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ వెల్లడించారు. రహదారి అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల సుందరీకరణ, ఆధునిక లైటింగ్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సుమారు కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులకు నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు వివరించారు.

కొత్తగూడెం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రైల్వే లైన్‌కు ఈ వైపున ఉన్న ఐదు ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని మేయర్ తెలిపారు. ఇందులో భాగంగా సూర్య ప్యాలెస్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు, గణేష్ టెంపుల్ నుంచి ప్రగతి  నగర్ వరకు ఉన్న రహదారుల విస్తరణతో పాటు ఆధునిక లైటింగ్ సదుపాయాలు.

కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.ఈ రహదారుల అభివృద్ధితో పట్టణంలోని ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరమవడంతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కొత్తగూడెం పట్టణాన్ని మెరుగైన మౌలిక సదుపాయాలతో కూడిన ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యమని మేయర్ స్పష్టం చేశారు. రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పట్టణ సుందరీకరణ వంటి అంశాలపై ప్రాధాన్యతతో పనిచేస్తామని తెలిపారు. అదేవిధంగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును కొత్తగూడెంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య, రైల్వే రీజినల్ ఇంజనీర్ శశాంక్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసన్న కుమారి , సి పి ఐ పార్టీ జిల్లా నాయకులు సబీర్ పాషా, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైల్వే శాఖ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు,  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు