సాగునీటిపై రైతుల ఆగ్రహం!

17-11-2026 | 06:08pm

* ఎల్‌నినో సాకుతో రబీకి సాగునీరు లేదన్న అధికారుల ప్రకటనపై రైతుల ఆగ్రహం

* తుమ్మలచెరువును పూర్తిస్థాయిలో నింపి నీరివ్వాలని ఈఈకి వినతి

అశ్వాపురం, నవంబర్ 17 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం పేరుతో రబీ సాగుకు సాగునీరు అందించలేమని అధికారులు స్పష్టం చేయడంతో రైతాంగం భగ్గుమంది. సీతారామ ప్రాజెక్టుకు జన్మస్థలమైన అశ్వాపురం(Ashwapuram) మండలంలోనే సాగునీటి కష్టాలు ఎదురుకావడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, రబీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సమావేశం వాడీవేడిగా సాగి చివరకు రసాభాసగా ముగిసింది. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుమ్మలచెరువు ఆయకట్టుకు రబీ సాగు కోసం నీరు అందించే అవకాశం లేదని స్పష్టం చేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు నిర్మాణానికి పునాదిగా నిలిచిన ఈ ప్రాంతానికే సాగునీరు అందించలేని పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. తుమ్మలచెరువును పూర్తిస్థాయిలో నింపకుండా, మారెళ్లపాడు మోటార్లను నిలిపివేసి నీటిని ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారని అధికారులను నిలదీశారు. సాగునీరు, తాగునీరు తమ హక్కు అని, ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపి సాగునీటిని నిరాకరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చెరువుకు ఉన్న మూడు ప్రధాన కాలువల్లో కనీసం ఒక కాలువ పరిధిలోని ఆయకట్టుకైనా రబీ సాగునీరు అందించాలని తాము కోరుతున్నామని, ఇందుకు సంబంధించి ఆయకట్టు రైతులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసుకున్నామని తెలిపారు.

ఇప్పటికే విత్తన ధాన్యం కొనుగోలు చేసి, నారుమళ్లు సిద్ధం చేసుకున్నామని, సాగుకు సన్నద్ధమైన తరుణంలో నీరు అందించలేమని చెప్పడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మలచెరువును పూర్తిస్థాయిలో నింపి రబీ వరి పంటకు సాగునీరు అందించాల్సిందేనని పట్టుబట్టడంతో సమావేశంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో సాగునీటి పంచాయితీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అనంతరం రైతులు ఎస్ఆర్ఎల్పీ ఈఈ కార్యాలయానికి చేరుకుని ఈఈ తెల్లం వెంకటేశ్వర్లును కలిసి తుమ్మలచెరువును పూర్తిస్థాయిలో నింపడంతోపాటు ఆయకట్టు పరిధిలోని రబీ పంటలకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

రైతుల సమస్యలను విన్న ఈఈ సానుకూలంగా స్పందిస్తూ, విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాగునీరు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు కొంతమేర శాంతించారు. అయితే ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులకు రబీ సాగునీరు అందుతుందా? లేదా? అన్నది అధికారుల తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో ఆయకట్టు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు సాగుకు సిద్ధమైన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు మర్రి మల్లారెడ్డి, తోకల వీరయ్య, బద్దం శంభారెడ్డి, తుక్కాని రామిరెడ్డి, స్వర్గం రాఘవులు, బొక్కా రవీందర్, తెల్లం నాగేశ్వరరావు, వేల్పుల వెంకన్న, సతీష్ తదితరులతో పాటు ఏడీఏ తాతారావు, ఏవో చటర్జీ, ఇరిగేషన్ డీఈ రమేష్ బాబు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ఏఈవోలు, ఇరిగేషన్ ఏఈ, ఆయకట్టు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు