అక్రమ చిట్టీల దందాపై పోలీసుల కొరడా!

09-11-2026 | 08:06pm

ముగ్గురి అరెస్ట్.. ఐదు చిట్టీ పుస్తకాలు స్వాధీనం

కొత్తగూడెం, నవంబర్ 9 (విజయక్రాంతి ): కొత్తగూడెం పట్టణంలో(Kothagudem town) అనధికారికంగా ప్రైవేట్ చిట్టీల నిర్వహణకు(Management of private chit funds) పాల్పడుతున్న ముగ్గురిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారనే సమాచారంతో కొత్తగూడెం పోలీస్‌లు దర్యాప్తు(Kothagudem police conduct investigation) చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తగూడెంలోని న్యూ గోలగూడెం ప్రాంతానికి చెందిన కత్తుల సరోజ (62), కత్తుల చంద్రకళ (37), కత్తుల కుమార్ (40) ప్రైవేట్ చిట్టీల నిర్వహణకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరు మొత్తం 11 చిట్టీలను నిర్వహిస్తూ, వివిధ మొత్తాల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఒక్కో చిట్టీకి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు మొత్తాలను నిర్ణయించి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ప్రెస్‌నోట్‌లో వెల్లడించారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.55,33,745 నగదుకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఐదు చిట్టీ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

అనుమతులు లేకుండా చిట్టీల పేరుతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా అధిక వడ్డీలు, ఆకర్షణీయమైన లాభాల ఆశతో అనధికారిక ఆర్థిక లావాదేవీల్లో పాల్గొని నష్టపోవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు