దళిత సర్పంచ్ కుటుంబంపై కులం పేరుతో దూషణలు
24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలి
మాదిగ మహాశక్తి కోర్ కమిటీ సభ్యులు అసంపల్లి శ్రీనివాస్, వాసు డిమాండ్
మంథని, నవంబర్ 09 (విజయక్రాంతి): దళిత సర్పంచ్ కన్నూరి రాజబాబు(Dalit Sarpanch Kannuri Rajababu), ఆయన కుటుంబ సభ్యులపై కులం పేరుతో దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ మహాశక్తి కోర్ కమిటీ సభ్యులు(Members of the Madiga Mahashakti Core Committee) డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా పుట్టపాక ప్రధాన రహదారిపై నిర్వహించిన రాస్తారోకోకు వారు మద్దతు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు అసంపల్లి శ్రీనివాస్, వాసు మాట్లాడుతూ.. పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి అభిరామ్ విద్యాధర్ బైక్పై వస్తుండగా కారుతో ప్రమాదకరంగా ఢీకొట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించడంతో పోరెడ్డి తిరుపతి రెడ్డి ఫోన్ లాక్కొని కులం పేరుతో బాధిత కుటుంబ సభ్యులను దూషించినట్లు తెలిపారు. దళిత కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.
సీనియర్ న్యాయవాదులు బూడిద మల్లేష్, పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ.. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, ఘటనకు సంబంధించిన ఆధారాల మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రి, గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అడ్వైజర్ అసంపల్లి రవి, న్యాయవాది ఇరుగురాల సంతోష్, గడ్డం సునీల్ కుమార్, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి బూడిద రాజన్న, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.