కోతుల బెడద నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

09-11-2026 | 07:55pm

ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం

ఘట్‌కేసర్, నవంబర్ 9 (విజయక్రాంతి) : పోచారం డివిజన్(Pocharam Division) పరిధిలోని విజయపురి కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో పెరిగిపోతున్న కోతుల బెడదను(Monkey Menace) నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయపురి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు(Deputy Commissioner, Ghatkesar Circle) వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో కోతుల సంచారం గణనీయంగా పెరిగిందని, దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కోతులు ఇళ్లలోకి చొరబడి నిత్యావసర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని, వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు కోతుల దాడుల భయంతో ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలను, వృద్ధులను కోతులు తరుముతూ దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.

ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని కోతుల బెడద నివారణకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, కోతులను సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు చేపట్టాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈకార్యక్రమంలో విజయపురి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నూనెముంతల భాను కుమార్ గౌడ్, ఆర్. శ్రీధర్, కె. జగదీష్, ఎం. సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు