పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
- అదనపు కలెక్టర్ రాములు
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి, ఆర్.డి.ఓ. శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జి.ఓ. నెం. 76 క్రింద వచ్చిన దరఖాస్తుల పురోగతి, జి.ఓ. నెం. 59 దరఖాస్తుల పరిష్కారం, భూసేకరణ ప్రక్రియ, భూ భారతి ఫైళ్ల పరిష్కారం, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. ఆయా అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఫైళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సంబంధిత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.