ఈఎస్ఐ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి: ఏఐటీయూసీ

07-11-2026 | 10:35pm

 సివిల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈఎస్ఐ నగదు చెల్లింపులు ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్న,సింగరేణి యాజమాన్యం వాటా, కాంట్రాక్ట్ కార్మికుల వాటాను ఈఎస్ఐకి చెల్లిస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొత్తగూడెంలో ఈఎస్ఐ హాస్పటల్ ప్రారంభించకపోవడం తో కాంట్రాక్ట్ కార్మికులు ఈఎస్ఐ సేవలను పొందలేకపోతున్నారని, తక్షణమే కొత్తగూడెం కేంద్రంలో ఈ ఎస్ఐ హాస్పిటల్ ను ప్రారంభించాలి.

సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC(Singareni Contract Workers Union-AITUC) ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు శనివారం రైటర్ బస్తి సివిల్ కార్యాలయం వద్ద నినాదాలుతో ఆందోళన చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు వాట, సింగరేణి యాజమాన్యం చెల్లిస్తున్న వాటా నెలకు సుమారు 5 లక్షల వరకు కొత్తగూడెం కార్పోరేట్ నుండే ఈఎస్ఐ కు వెళుతుంది.

లక్షలాది రూపాయలు ఈఎస్ఐకి ప్రతినెలా వెళ్తున్నప్పటికీ నేటి వరకు హాస్పటల్ ప్రారంభించి వైద్య సదుపాయాలు , ఇతర సంక్షేమ పథకాలు, రావలసిన బెనిఫిట్స్ కాంట్రాక్ట్ కార్మికులకు అందడం లేదని విమర్శించారు.సింగరేణి యాజమాన్యం తక్షణమే ఈఎస్ఐ అధికారులతో మాట్లాడి రామవరంలో ప్రారంభించాలనుకున్న హాస్పిటల్ ను తక్షణ ప్రారంభనికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఎస్ ఐ కలిగిన ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే రావాల్సిన దాన సంస్కార ఖర్చులు,విధి నిర్వహణలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి రావలసిన బెనిఫిట్స్ అందేటట్లుగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ప్రభాకర్,లక్ష్మణ్,కళ్యాణ్,ప్రేమ్, రామకృష్ణ,సంధ్య,బేగం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు