పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఘనంగా "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు"
మహబూబాబాద్, (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ నిరుపేదలకు నిలువ నీడ కనిపించేందుకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకల్లో పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అభినందించారు.
అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు అనుమతి పత్రాలను లబ్ధిదారులకు అందజేసి,సంపూర్ణ పోషణ అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించి, ఎల్ నినో నేపథ్యంలో యాసంగి సీజన్లో ఆరు తడి పంటలు సాగు చేయడానికి విత్తనాలను పంపిణీ చేశారు.