వృద్ధురాలి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

08-11-2026 | 12:34am

 2వాహనాలు, వెండి కడియాలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని వచ్చనూర్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళా హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులను కమిషనరేట్ కేంద్రంలో కరీంనగర్ సిపి గౌస్ ఆలం మీడియా ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు.

గత నెల 31న పచనూరు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న ఉప్పులేటి లక్ష్మి అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు కనిపించకపోవడంతో హత్య కేసుగా నమోదు చేసిన తిమ్మాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతకుముందు అదే గ్రామంలో రెండు నెలల క్రితం ఒంటరి వృద్ధురాలు కూడా చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు శతాధిక వృద్ధురాలు కావడంతో అనారోగ్యంతో మరణించిందని భావించి అంత్యక్రియలు నిర్వహించారు.

కరీంనగర్ రూరల్ ఏసిపి విజయకుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ పోలీసులు ఈ రెండు కేసులకు కొంత పోలిక ఉందని గ్రహించి ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల పేర్లు బయటికి రావడంతో ఆ దిశగా వేట కొనసాగించారు. ఈ క్రమంలో శనివారం అలమనూరు చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.

వారిని తమదైన శైలిలో విచారించగా వచునూరు గ్రామంలో జరిగిన హత్యను తామే చేసినట్లు అంగీకరించడంతో మిగతా నిందితుల కోసం గాలింపులు చేపట్టి మరో నిందితున్ని కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో వచనూరు గ్రామానికి చెందిన మద్దూరి సాయి (24), మానుకోల పవన్ కుమార్ (28), పోరండ్లకు చెందిన కెన్నెరా రాజు (25), కొత్తపల్లికి చెందిన ఎల్కతుర్తి రాజు ( 25), లు ఉన్నారు. మరో నిందితుడు గుండ్లపల్లి కి చెందిన కనపర్తి మణికంఠ (28) పరారీలో ఉన్నట్టు సిపి గౌస్ ఆలం తెలిపారు.

నిందితుల వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు వెండి కడియాలు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ హైదరాబాద్ ప్రాంతాల్లో అన్ని సొమ్ముగా మార్చుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నిందితులపై రెండు హత్య కేసుల్లో కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించనున్నట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతంగా జరిపి చేదించిన రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తిమ్మాపూర్ సర్కిల్ పోలీస్ అధికారులను సిపి ప్రత్యేకంగా అభినందించారు.

సంఘటనల వివరాలు:

మొదటి హత్య (16-08-2026):

వచ్చనూర్ గ్రామానికి చెందిన ఒంటరి వృద్ధురాలు ఉప్పులేటి భూదమ్మ (103 సం.) ఇంట్లోకి మొదటి నిందితుడు మద్దూరి సాయి తన సహచరులతో కలిసి ప్రవేశించి, ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలు, బంగారు ముక్కుపుడకలను దొంగిలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె వృద్ధాప్యం కారణంగా సహజంగానే మరణించిందని భావించి అంత్యక్రియలు నిర్వహించారు. దొంగిలించిన వస్తువులను పవన్ సహాయంతో మణికంఠ అనే వ్యక్తికి విక్రయించి నగదును పంచుకున్నారు.

రెండవ హత్య (31-10-2026):

తొలి హత్యలో ఎవరికీ అనుమానం రాకపోవడంతో నిందితులు మరో నేరానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన ఒంటరి వృద్ధురాలు ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లచ్చవ్వ (80 సం.) ఇంట్లోకి చొరబడి, ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆమె వద్దనున్న వెండి కడియాలు, బంగారు నల్లపూసల గొలుసు, చెవికమ్మలను అపహరించారు. వీటిలో కొన్నింటిని కరీంనగర్‌లో, మిగతా బంగారు నగలని హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు.

నిందితుల అరెస్ట్ – రికవరీ:

వృద్ధురాలి అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు, శనివారం (07-11-2026) మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అలుగునూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. తిమ్మాపూర్ వైపు నుంచి వస్తున్న స్కూటీని ఆపి విచారించగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. విచారణలో వచ్చనూర్‌లో జరిగిన రెండు హత్యలు తామే చేసినట్లు వారు అంగీకరించారు. అనంతరం మూడో నిందితుడు ఎల్కతుర్తి రాజును హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితులు:

  1. మద్దూరి సాయి (24), తండ్రి: నారాయణ, నివాసం: వచ్చనూర్, తిమ్మాపూర్
  2. కిన్నెర రాజు (25), తండ్రి: రాములు, నివాసం: పోరంట్ల, తిమ్మాపూర్
  3. ఎల్కతుర్తి రాజు (25), తండ్రి: కొమురయ్య, నివాసం: కొత్తపల్లి, తిమ్మాపూర్
  4. మానుకోల పవన్ కుమార్ అలియాస్ జాక్ (28), నివాసం: వచ్చనూర్
  5. మరో నిందితుడు కనపర్తి మణికంఠ (28), నివాసం: గుండ్లపల్లి, గన్నేరువరం.

మరిన్ని వార్తలు