అమృతకు బండి ఆపన్న హస్తం

08-11-2026 | 12:07am

తక్షణ సాయంగా రూ.50 వేలు పంపిన కేంద్ర మంత్రి

తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయండి

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కోరిన బండి సంజయ్

ఇల్లు మంజూరయ్యాక కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఇవ్వండి

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా రూ.50 వేలు పంపారు. ఈ నగదు మొత్తాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ద్వారా బాధితురాలకు అందజేశారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడుతూ అమృత దుస్థితిని వివరించారు.

అమృతకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. మరోవైపు కొడుకును కోల్పోయి పుట్టెడు అమృతకు అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైన వెంటనే ఆ ఇంటికి అవసరమైన సామాగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు