కొడంగల్‌కు వేల కోట్లు.. మునుగోడుకు మొండిచేయి

08-11-2026 | 12:12am

ఫ్లోరైడ్ పీడిత మునుగోడుపై ప్రభుత్వానికి కనికరం లేదా

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి విన్నవించా

మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. నిధులు ఎందుకు రావడం లేదు?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): కొడంగల్ నియోజకవర్గంలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తున్నారని, అందుకు తాను వ్యతిరేకం కాదని, అయితే ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అదృష్టం కలిసి వచ్చి ఆ పదవిలో ఉన్నారని, దానిని తాను తప్పుబట్టడం లేదని, కానీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.మునుగోడు పట్టణంలోని పీఆర్‌ఆర్ గార్డెన్‌లో శనివారం జరిగిన పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిక్షం గౌడ్‌ను ఘనంగా సన్మానించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృషి, పట్టుదల, దీక్షకు మారుపేరు బిక్షం గౌడ్ అని కొనియాడారు. సమాజంలో అవినీతి పేరుకుపోతోందని, నాయకులు నీతిగా ఉంటేనే ప్రజలకు నీతివంతమైన పాలన అందుతుందని అన్నారు. నాయకులు అవినీతికి పాల్పడితే పేదలకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.

మునుగోడు అభివృద్ధి పట్ల తనకు ప్రత్యేకమైన తపన ఉందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించానని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మునుగోడుతో పాటు వెనుకబడిన నియోజకవర్గాలను గుర్తించి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

మరిన్ని వార్తలు