జిల్లాలో భూ పునఃసర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

08-11-2026 | 12:16am

ఎక్స్‌ట్రాజెన్ రోవర్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో చేపడుతున్న భూముల పునఃసర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. భూ సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆదేశాల మేరకు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎక్స్‌ట్రాజెన్ రోవర్ పరికరాల వినియోగం, నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల పునఃసర్వేను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వినియోగించి సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సిబ్బంది సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ఇన్‌స్పెక్టర్ సోమేశ్వర్, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, గ్రామపంచాయతీ అధికారులు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు