డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

28-11-2026 | 09:54pm

భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

భద్రాచలం,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) శనివారం భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌(Bhadrachalam Traffic Police Station)ను వార్షిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించి సిబ్బంది విధుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్, దేవాలయాల పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు, మార్గ నిర్దేశాలు, పార్కింగ్ ఏర్పాట్లపై ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలను వెంటనే నియంత్రించాలని ఆదేశించారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డీఎస్పీ అరుణ్ కుమార్, సీఐ సట్ల రాజు, ఎస్‌హెచ్‌ఓ కేశవ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు