సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం సీఎంకు వినతి

28-11-2026 | 09:52pm

సూర్యాపేట, నవంబర్ 28 (విజయక్రాంతి) : సూర్యాపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి(Comprehensive Development of Suryapet Town) అవసరమైన నిధులు మంజూరు చేసి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత(Municipal Chairperson Morishetti Nivedita) లక్షాధి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని(Enumula Revanth Reddy) కోరారు.శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌–2026 కర్టెన్‌ రైజర్‌ స్టేక్‌హోల్డర్‌ సంప్రదింపుల సమావేశంలో పాల్గొన్న ఆమె ముఖ్యమంత్రిని కలిసి సూర్యాపేట పట్టణ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో, ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో భాగంగా ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు,జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ శ్రీదేవి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ తరఫున చైర్‌పర్సన్‌ నివేదిత లక్షాధి హాజరయ్యారు.

ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాలు, ఎల్‌నినో కారణంగా ఏర్పడే పరిస్థితులు, తీవ్ర వాతావరణ సంఘటనలు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి ఒత్తిడి, కరువు, నీటి కొరత వంటి అంశాలపై చర్చించారు. వీటి ప్రభావం తెలంగాణలోని వివిధ రంగాలపై ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి,వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను ఎలా రూపొందించాలనే అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా నివేదిత లక్షాధి ముఖ్యమంత్రికి సూర్యాపేట పట్టణ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించి, సూర్యాపేట అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు