పని సమయాన్ని పెంచడం శ్రమదోపిడితో సమానం
కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ పాఠశాలల(Pre-primary schools)లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేయాల్సిన ఇన్స్ట్రక్టర్ లు, ఆయాలను సాయంత్రం వరకు విధులలో ఉంచడం శ్రమ దోపిడీతో సమానమని తెలంగాణ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాల యూనియన్ రాష్ట్ర న్యాయ సలహాదారు జక్కనపల్లి గణేష్, రాష్ట్ర కో కన్వీనర్ ఎం.లక్ష్మణ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఐడిఓసి ముందు నిరసన తెలిపిన అనంతరం వారు మాట్లాడారు. గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ లు, ఆయాల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీతాలు తక్కువగా ఉండడంవల్ల పెరిగిన నిత్యవసర ధరలకు అనుకూలంగా జీవనం కొనసాగించడం ఇబ్బందిగా మారిందన్నారు. అనధికారికంగా అమలు చేస్తున్న ఇన్స్ట్రక్టర్, ఆయాలలకు పని సమయాన్ని తగ్గించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వర్కర్ లకు ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలన్నారు. సమాన పనికి సమాన వేతనంగా, కనీస వేతన చట్టం ప్రకారం జీతాలను సవరించాలని అన్నారు. ప్రతినెల ఐదవ తారీకు లోపు జీతాలు వారి అకౌంట్లలో జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ లు, ఆయాలు లావణ్య, సుధా, రాజమణి, దివ్య, మమత, రమ్య, సాజిదా, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.