ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ ‘ఐపేవ్’ కు సీఆర్ఆర్ఐ ధ్రువీకరణ
హైదరాబాద్: భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల మదింపు వ్యవస్థలో ఒక కీలక పరిణామంగా.. ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'ఏఆర్ఆర్బీ సిస్టమ్స్(ARRB Systems)' భారతీయ విభాగమైన 'ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ ఇండియా', తన 'ఇంటెలిజెంట్ పేవ్మెంట్ అసెస్మెంట్ వెహికల్' (ఐపేవ్)కు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) నుండి విజయవంతంగా ధ్రువీకరణ పొందినట్లు ప్రకటించింది. ఒకే వాహనంలో బహుళ రహదారి సర్వే సామర్థ్యాలను అందుబాటులోకి తెచ్చే ఈ సమగ్ర పరిష్కారాన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకురావడానికి ఈ ధ్రువీకరణ ఒక ముఖ్యమైన ముందడుగు.
భారతదేశంలో రహదారుల నెట్వర్క్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, రోడ్ల పైభాగపు స్థితిని మాత్రమే కాకుండా, వాటి అంతర్గత నిర్మాణ పటిష్టతన కూడా అంచనా వేయడం అత్యంత అవసరంగా మారింది. సాంప్రదాయకంగా, రహదారుల వివిధ అంశాలను పరిశీలించడానికి వేర్వేరు సర్వే సాంకేతికతలు, ప్రక్రియలు అవసరమయ్యేవి. ఈ సవాలును అధిగమించేందుకు ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ ఇండియా రూపొందించిన ‘ఐపేవ్’, ఒకే సర్వే ఆపరేషన్‌లో రహదారి పనితీరు మరియు నిర్మాణ పటిష్టత రెండింటినీ మదింపు చేసే సమగ్ర వేదికగా పనిచేస్తుంది.
భారతదేశంలో ఒకే సమగ్ర వాహనంలో ఈ స్థాయి రోడ్ అసెస్మెంట్ టెక్నాలజీల కలయికను అందిస్తున్న ఏకైక సంస్థ ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ ఇండియా మాత్రమే. పేవ్మెంట్ ఇంజనీరింగ్, రోడ్ సర్వేయింగ్ మరియు ఆస్తుల నిర్వహణలో అంతర్జాతీయ అనుభవాన్ని జోడిస్తూ, ఐపేవ్ అత్యాధునిక సాంకేతికతను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ వేదిక ప్రధానంగా మూడు కీలక సామర్థ్యాలను ఒకే చోటకు చేర్చుతుంది.
నెట్వర్క్ సర్వే వెహికల్ (ఎన్ఎస్వి): ఇది రహదారి పైభాగపు స్థితిగతులను మరియు పనితీరు ప్రమాణాలను నమోదు చేసి,రహదారి నెట్వర్క్ నాణ్యతను క్రమబద్ధంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. ట్రాఫిక్ స్పీడ్ డిఫ్లెక్టోమీటర్ (టిఎస్‌డి): వాహనాల రాకపోకల రద్దీ మధ్య రహదారిపై పడే భారాన్ని కొలవడం ద్వారా రోడ్డు నిర్మాణ పనితీరును అంచనా వేస్తుంది. తద్వారా నిర్మాణపరమైన బలహీనతలను గుర్తించడానికి, రహదారి బరువును మోసే సామర్థ్యాన్ని మదింపు చేయడానికి ఇది తోడ్పడుతుంది.
ఈ పరిణామంపై ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. “ఐపేవ్ విజయవంతంగా ధ్రువీకరణ పొందడం ఏఆర్ఆర్బీ సిస్టమ్స్‌కు ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచ స్థాయి అత్యాధునిక రహదారి మదింపు సాంకేతికతలను భారతదేశానికి తీసుకురావడంలో మా నిబద్ధతకు ఇది నిదర్శనం. ఈ ఒక్క సాంకేతికత ద్వారా అనేక స్వతంత్ర సర్వే ప్రక్రియలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు. డేటా సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, రహదారి పైభాగపు పరిశీలనలను లోపలి నిర్మాణ స్థితిగతులతో అనుసంధానించడానికి ఇది సహాయపడుతుందన్నారు.