మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంటిలో ఈడీ సోదాలు
- ఖానాపూర్‌లో ఆరు గంటలు తనిఖీలు
- జగిత్యాలలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు
- కీలక పత్రాలు స్వాధీనం
- వివరాలు వెల్లడించని అధికారులు
- అక్రమ కేసులకు భయపడ: రేఖా నాయక్
నిర్మల్/ఖానాపూర్, నవంబర్ 20 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్(Former MLA Rekha Naik) ఇంటిలో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారులు.. సీఎంఆర్ బియ్యం పక్కదారి, ఇతర కీలక పత్రాలు, లాకర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఉదయం 9 గంటలకు అధికారులు ఖానాపూర్ పట్టణంలో ఉన్న రేఖా నాయక్ ఇంటికి చేరుకున్నారు. మూడు కార్లలో మొత్తం 10 మందికి పైగా సిబ్బంది ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే జగిత్యాలలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఖానాపూర్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ తనిఖీలు నిర్వహించారు.
అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇతరుల ఎవ్వరిని లోనికి రానివ్వకుండా స్థానిక పోలీస్ సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేఖా నాయక్ బీఆర్ఎస్ నుంచి 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో బీఆర్ఎస్ టికెట్ ఆశించగా ఆమెకు నిరాకరించారు. కేటీఆర్‌కు సన్నిహితుడైన జాన్సన్ నాయక్‌కు కేటాయించగా ఆయన సల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. టికెట్టు రాకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఆ తర్వాత ఇద్దరు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉండటంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆమెకు సంబంధించిన ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో గల ఏఆర్ఎస్ రైస్ మిల్లులో సీఎంఆర్ బియ్యం రూ.40 కోట్ల అక్రమాలపై ఈడీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్నది.
శుక్రవారం ఈడీ అధికారులు ఖానాపూర్లోని రేఖా నాయక్ ఇంటితోపాటు జగిత్యాల ఇతర ప్రాంతాల్లో బంధువుల ఇండ్లలో ఈడి సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతుంది. అధికారులు మాత్రం శాఖ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పి వెళ్లిపోయారు. తనిఖీలు చేస్తున్న సమయంలో రేఖా నాయక్ ఖానాపూర్ లోని ఉండగా ఆమెకు మద్దతుగా ఆమె అనుచరులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ రేగింది.
అక్రమ కేసులకు భయపడ: రేఖా నాయక్
10 సంవత్సరాల పాటు ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రజాభిమానం చూరగొన్నానని, తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించి వెళ్లిపోయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో అనుభవం లేకుండా రైస్ మిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి నష్టాలు చవిచూసానని, ఆ కారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం సొమ్ము బకాయి పడటంతో తనపై కేసు నమోదు అయిందని పేర్కొన్నారు. మొత్తం రూ.12 కోట్ల బకాయికి వడ్డీతో కలిపి రూ.22 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేందుకు కోర్టు ద్వారా అంగీకారం తెలిపినట్టు వివరించారు.
రాష్ట్రంలో ఇలాంటి కేసులు సుమారు 140 మంది వరకు ఉండగా తనపైనే ప్రత్యేకంగా సోదలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంట్లోని బీరువాను సైతం పగులగొట్టి తనిఖీ చేయగా అందులో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే లభించాయని పేర్కొన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని, తన జీవితం ప్రజాసేవకే అంకితం అవుతుందని చెప్పారు.