ఏఐ హబ్‌గా హైదరాబాద్
- అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
- ఐరాస గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను కృత్రిమ మేధ (ఏఐ), పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) పేర్కొన్నారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా 1ఎం1బీ సంస్థ నిర్వహించి న గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, ఏఐ, అధునాతన తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు.
తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని, ప్రస్తుతం ఏఐ సహా నూతన సాంకేతిక రంగాల్లో పురోగతి వేగంగా విస్తరిస్తుందని మంత్రి తెలిపారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, పటిష్ట పారిశ్రామిక పునాదులు రాష్ట్రానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. సాంకేతిక అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి రంగాల్లో ఏఐ, డిజిటల్ ఆవిష్కరణల వినియోగం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు, మానవాభివృద్ధి సమాంతరంగా సాగినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్లు, అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే బలమైన ఆవిష్కరణల వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంతో పాటు, వారి ఆలోచనలను ప్రపంచస్థాయి ఆవిష్కరణలుగా మలిచేందుకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తెలంగాణ రైజింగ్ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను కోరారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.