నల్లగొండ కాంగ్రెస్లో కల్లోలం..!
- రాజగోపాల్ రెడ్డి వర్సెస్ పున్న కైలాష్ నేత
- మొదలైన మాటల యుద్ధం
- దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకో.. పున్న కైలాష్
- డీసీసీ అధ్యక్షుడికి రాజీనామా చేయి..రాజగోపాల్ రెడ్డి వర్గం
నల్లగొండ బ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్(Nalgonda Congress) రాజకీయాల్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ వేడి రాజుకుంది. గురువారం నల్లగొండలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్రంగా స్పందించడంతో జిల్లా కాంగ్రెస్ లో పరిస్థితి కల్లోలంగా మారినట్లు అయ్యింది. మొత్తానికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
పున్న కైలాష్ నేత వ్యాఖ్యలకు కౌంటర్
నల్లగొండలోని యాదవ సంఘం భవనంలో గురువారం నిర్వహించిన సమావేశం లో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే ఉండు, లేదంటే పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టుకో అంటూ తీవ్రంగా విమర్శించారు. అలాగే మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తారా? కాంట్రాక్టులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కత్తి కడతారా? అం టూ విమర్శలు గుప్పించాడు. దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు సైతం స్పందించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి రాజగోపాల్ రెడ్డి ని విమర్శించే హక్కు కైలాష్ కు లేదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్నారు.
ప్రోటోకాల్ పాటిస్తున్నారా అంటూ ఘాటు విమర్శలు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పున్న కైలాష్ క్షేత్రస్థాయిలో ఎంతవరకు పర్యటించావని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎంతవరకు కలిశారని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ గురించి మా ట్లాడే ముందు తన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటిస్తున్నారా? మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫొటో అయినా కార్యక్రమాల్లో పెడుతున్నారా? అంటూ ఘాటైన విమర్శలు చేయడంతో రాజకీయంగా దుమారం లేచినట్లు అయింది.
జిల్లా కాంగ్రెస్లో ఉత్కంఠ?
ఒకవైపు రాజగోపాల్ రెడ్డిపై చేసిన వ్యా ఖ్యలకు పున్న కైలాష్ క్షమాపణ చెప్పాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తుండగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని పున్న కైలాష్ ప్రకటించడం జిల్లా కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలను మరింత ఆసక్తికరంగా మార్చిం ది. ఈ పరస్పర విమర్శలు పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లే అవకాశాల నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నల్లగొండ కాంగ్రెస్ లో లేచిన ఈ కల్లోలం రాజకీయంగా ఏ వైపునకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.