బె‘ధర’హో!
- వంటింట్లో సరుకుల వెలతి!
- మార్కెట్‌లో రోజురోజుకు పిరమెక్కుతున్న నిత్యావసరాలు
- సామాన్యుడిపై పెరుగుతున్న ఆర్థిక భారం
- వందకు చేరువైన కూరగాయల ధరలు
- రూ.500 పెట్టినా నిండని సంచి
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల(Prices of essential commodities)తో సామాన్య ప్రజలు బెంబే లెత్తిపోతున్నారు.- ఇప్పటికే సన్న బియ్యం ధరలు మార్కెట్‌లో అధికంగా పెరగడంతో ఆందోళనలో ఉన్నారు. మరోవైపు కూరగాయలు, పప్పులు, వంటనూనెతో పాటు టీ పొడి, పాలు, చక్కెర చివరకు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో వంటింటికి ధరల సెగ తాకుతోంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం అదనంగా పడుతోంది. రోజువారీ వినియోగించే సరకుల ధరలు 20 నుంచి -30 శాతం మేర పెరగడంతో సామాన్య కుటుంబాల బడ్జెట్‌పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. కుటుంబ ఆదాయం పెరగకున్నా, ఖర్చులు పెరగడంతో ఇంటి బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతున్నదని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.
రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు ఉద్యోగులు, పింఛన్‌పై ఆధారపడేవారు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచే ధరాఘాతంలో సామాన్య ప్రజలు తమ బతుకులను వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బియ్యం క్వింటాపై రూ. వెయ్యి వరకు ధరలు పెరిగాయి. క్వాలిటీ రైస్ గతంలో కిలో రూ.45 నుంచి రూ.50 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.70 అంతకంటే ఎక్కువగా ఉండటం సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. 26 కిలోల రైస్ బస్తాపై సుమారు రూ.300- నుంచి రూ. 400 లు పెంచారు. గడిచిన నెలన్నర రోజుల్లోనే 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షాలతో పాటు, రవాణా ఖర్చులు పెరగడం, రైతులు కూరగాయల సాగు తగ్గించడం మూలంగా రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతోంది. మరో వైపు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకోవడతోనూ ధరల భారం ఎక్కువగా పడుతోందని చెబుతున్నారు. ఆదాయం పెరగకున్నా, ఖర్చులు పెరగడంతో ఇంటి బడ్జెట్ పూర్తిగా మారుతోందని వాపోతున్నారు.
మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.40కి చేరింది. రూ.30 వరకు కిలో ఉన్న టమాట పది రోజుల క్రితం రూ.60 వరకు చేరి ఇప్పుడు రూ.40కు చేరింది. పచ్చిమిర్చి, పప్పులు, వంటనూనె ఇలా వంటింటి ధరలు ప్రతి ఇంటింటా సెగలు పుట్టిస్తున్నాయి. టమాట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి, ఉల్లి మహారాష్ట్ర నుంచి, కీరదోస, క్యారెట్ బెంగళూరు, పచ్చిమిర్చి అనంతపురం, ఆలుగడ్డ ఒడిషా, బెంగాల్‌తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్నాయి. మార్కెట్లో ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు మరింత పెరిగాయి. ఉల్లి కిలో రూ.20 నుంచి రూ.60కి చేరింది.
అల్లం, వెల్లుల్లి ధరలు కిలో రూ.150 కంటే అధికంగానే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు రూ.30 ఉన్న టమాట రూ.60 వరకు చేరి ఇప్పుడు రూ.40గా ఉంది. గతంలో లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.160లోపే ఉండగా ప్రస్తుతం వాటి ధర రూ.180కి పైగానే ఉంది. పంచదార కిలో సగటున రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.60 నుంచి రూ. -70గా ఉంది. కంది, మినప, పెసరపప్పులు గతంతో పోలిస్తే కిలోకు రూ.20 అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఇక సన్న బియ్యంతోనూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుంచి రూ.250 వరకు అదనపు భారం పడుతోంది. గడిచిన 20 రోజుల్లోనే 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
కొండెక్కిన కోడిగుడ్డు ధరలు..
కోడిగుడ్ల ధర పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. అయితే ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం కారణంగా పోషకాహారం కోసం గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో రూ.5 నుంచి రూ.6 వరకు ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.7 నుంచి రూ.8 వరకు పెరగడం వల్ల ఇది కాస్త నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపుతోంది. మరోవైపు కోళ్లదాణా ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరగడం మూలంగానే గుడ్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, అస్సాం రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏప్రిల్‌లో యుద్ధం కారణంగా గుడ్ల ధరలు పడిపోయాయి. ఒక గుడ్డు ఉత్పత్తి కావాలంటే రైతుకు కనీసం సరాసరి రూ.5.50 ఖర్చు వస్తుంది. ఏప్రిల్ నుంచి జులై, ఆగస్టు నెల వరకు కొడిగుడ్డు రూ.6.35 వరకు విక్రయించారు. ఇప్పుడు గుడ్డు రూ.7 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని కోళ్ల రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు..
కూరగాయ - ధర (రూ. కిలో)
చిక్కుడు - 100
బీరకాయ - 80
బెండకాయ -85
వంకాయ - 50
గోకర కాయ - 75
పచ్చిమిర్చి - 70
క్యారెట్ - 80
దొండకాయ - 60
టమాట - 50