తేల్చుకుందామా?
- సిద్దిపేటలో పోటీచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ సవాల్
- నీటి విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేసిందే కాంగ్రెస్
- శ్రీశైలం, సాగర్, బనకచర్ల పేరుతో జలదోపిడీకి సహకారం
- 299ః512 వాటాల ఒప్పందంపై సంతకం చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. సిద్ధమా?
- కోవర్ట్, సబ్ వర్ట్, పర్వర్ట్.. సీఎం పాలన తీరిది
- వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సిద్దిపేట సభలో నాపై విమర్శలు
- నీ ద్రోహబుద్ధిని అసెంబ్లీలో ఎండగట్టకుంటే హరీశ్‌రావునే కాదు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): సిద్దిపేటలో తనపై నేరుగా పోటీ చేసి గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(BRS MLA Harish Rao) సవాల్ విసిరారు. ఎవరు ఏమిటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. కృష్ణా జలా ల్లో 299:512 టీఎంసీల వాటాల ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందు కు రేవంత్ సిద్ధమా? అని ప్రశ్నించారు.
తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ కాలరాస్తోందని, శ్రీశైలం, నాగార్జునసాగర్, బనక చర్ల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకే సిద్దిపేట సభలో తనపై విమర్శలకు దిగారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎంను శత్రు వుతో చేతులు కలిపిన కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించే సబ్వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ అంటూ వ్యాఖ్యానించారు. నాడైనా, నేడైనా తెలంగాణకు ద్రోహం చేయడమే కాంగ్రెస్ విధానమని దుయ్యబట్టారు. చంద్రబాబు జలదోపిడీకి రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని బీఆర్ఎస్, కేటీఆర్ బయటపెట్టడంతోనే సీఎంకు ఆగ్రహం వచ్చిందన్నారు. తాము ప్రశ్నించినప్పుడల్లా గత తేదీలతో లేఖలు విడుదల చేయడం తప్ప ప్రభు త్వం చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నీటిని తరలించిన గత కాంగ్రె స్ ప్రభుత్వమే, ఇప్పుడు సాగర్ టన్నెల్ విషయంలోనూ ఏపీకి సహకరిస్తుందని ఆరోపిం చారు. ‘నాడు చంద్రబాబుకు చెందిన డబ్బు సంచులతో దొరికిన దొంగ.. నేడు ఆయన జలదోపిడీకి సహకరిస్తున్నారు’ అని హరీశ్ మండిపడ్డారు. సిద్దిపేట సభలో అబద్ధాలు, విమర్శలు తప్ప ప్రజలకు చెప్పిందేమీ లేదన్నారు. సీఎం ప్రసంగంలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, చేతగానితనాన్ని ఎండగడుతున్నందుకే తనపై సీఎం కక్ష పెంచుకున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని హరీశ్‌రావు ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విషయంలో జీవో వచ్చినప్పుడు తాము అధికారంలో లే మని, అంతకుముందే తెలంగాణ జల హక్కుల కోసం పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. తమతో కలిసి పోరాడిన కాంగ్రెస్ నేతల్లో పీజేఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. నాడు తాము పదవులను త్యజిస్తే.. ఇప్పుడు పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టిన వ్యక్తి.. ఉద్యమ నేతల చరిత్రను వక్రీకరించడం సిగ్గుచేటన్నారు. పోతిరెడ్డిపాడుకు సపోర్టు చేశాడంటూ నాయిని నర్సింహారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో అమెరికాలో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన వ్యక్తి నాయిని అని గుర్తుచేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు బనకచర్ల విషయంలోనూ కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించిందని ఆరోపించారు.
299 టీఎంసీల వాటా తాత్కాలిక ఒప్పందమేనని, ఆ మేరకు కూడా తెలంగాణకు నీటిని వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడేళ్లుగా కృష్ణా జలాలపై వాదనలు వినిపించి తెలంగాణకు అనుకూలంగా అవార్డు సాధించలేకపోయారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తే ఆధారాలతో సహా ప్రభుత్వ వైఖరిని బయటపెడతానని, నీ ద్రోహ బుద్దిని ఎండగట్టకుంటే నా పేరు హరీశ్‌రావే కాదని, మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.పాలమూరు ప్రాజెక్టులో చిన్నపాటి పనులు పూర్తి చేస్తే 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు విమర్శించారు.
గతంలో తాము పంప్‌హౌజ్‌ల వద్దే ఉండి పనులు పూర్తి చేయించామని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం కుప్పానికి నీళ్లు తీసుకెళ్తుంటే.. తెలంగాణ సర్కారు పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. మదన్మోహన్రావు పేరుతో ఉన్న మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించలేదని, కేసీఆర్ హయాంలోనే నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారిణి శంకరమ్మకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తే, ఓడించింది మీ మంత్రి వర్గంలో ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. ఆమెపై నిజంగా గౌరవం ఉంటే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సూచించారు.
ఓట్లతో తొక్కే రోజులు దగ్గరలోనే..
‘తొక్కుకుంటూ వచ్చిన అని రేవంత్ చెప్పుకుంటున్నారు, ప్రజలు ఓట్లతో తొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హరీశ్‌రావు హెచ్చరించారు. 1989లో 181 స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 1994 ఎన్నికల్లో 26 సీట్లకే పరిమితమైందని గుర్తుచేశారు. ఆ తర్వాత పదేళ్లకు గానీ తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన, అవినీతి, హామీల అమలులో వైఫల్యాలతో కాంగ్రెస్‌కు మరో 20 ఏళ్ల వరకు అధికారం దక్కదని విమర్శించారు.
‘సిద్దిపేటలో నాపై పోటీ చేసి గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ ప్రకటించారు.. ఎవరో ఎందుకు, నువ్వే నాపై పోటీ చేయి, తేల్చుకుందాం’ అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఏబీవీపీ నుంచి టీఆర్ఎస్, ఇండిపెండెంట్, టీడీపీ మీదుగా కాంగ్రెస్‌లోకి వచ్చావని, రేపు ఏ పార్టీలోకి పోతావో నీకే తెలియదని విమర్శించారు. సోనియాగాంధీని బలి దేవత, ఇటలీ బొమ్మ అన్న నువ్వు.. కాంగ్రెస్‌లో చేరి రాహుల్‌గాంధీ, సోనియమ్మకు అటెండర్లా, ప్రియాంకగాంధీ బాడీగార్డులా వ్యవహరిస్తున్నావని విమర్శించారు. తాను ఇచ్చిన లేఖలోని హామీలను అమలు చేస్తే స్వయంగా స్వాగతిస్తానని చెప్పానని, సిద్దిపేట సభకు వచ్చి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు.
నేను తాటి చెట్టునైతే నువ్వు గంజాయి చెట్టు?
తాను తాటి చెట్టునైతే.. రేవంత్‌రెడ్డి గంజాయి చెట్టని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాటిచెట్టు సమాజానికి ఉపయోగపడుతుందని, గంజాయి చెట్టు సమాజానికి చీడ అని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ సమస్యలను, వాస్తవాలను చెబితే వారిని పిచ్చికుక్కలతో పోలుస్తారా? అని ప్రశ్నించారు. వారంతా లేకుంటే సీఎం కుర్చీ ఎలా వచ్చేదని నిలదీశారు. పిచ్చికుక్క ఎవరో నీ మాట తీరు చూస్తుంటే ప్రజలకు అర్థమవుతుందని, అధికారం ఉందని విర్రవీగొద్దని హితవు పలికారు.
కరువు పరిస్థితుల్లో ఏపీకి సహకరిస్తున్న కేంద్రం.. తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీని ప్రశ్నించే ధైర్యం రేవంత్‌కు లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కరువు సాయం అందిస్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు చేయవని చేయవని ప్రశ్నించారు. వడ్లు కొనడం లేదు, బోనస్ చెల్లించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే తమ బాధ్యతని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజా పోరాటంతో పాటు న్యాయపోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్‌రావు హెచ్చరించారు.