డిఫాల్ట్ మిల్లర్లకు చుక్కెదురు
- ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలన్న మిల్లర్ల పిటిషన్లనే కొట్టివేసిన సుప్రీంకోర్టు
- సీఎంఆర్ ఎగవేతపై రాష్ట్రవ్యాప్తంగా 540 ఎఫ్ఐఆర్లు
- ఏండ్లుగా బియ్యాన్ని ఎగ్గొడుతున్న కొందరు మిల్లర్లు
- పెండింగ్‌లో 28 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్
- దాని విలువ రూ. 6వేల 500 కోట్లకుపైగా!
- సుప్రీం తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి బూస్టప్
- రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం
- బియ్యం, లేదా దానికి తగిన డబ్బు చెల్లించాలని మరోసారి పౌరసరఫరాల శాఖ ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొడుతున్న రైస్ మిల్లర్ల(Rice Millers)పై చర్యలకు లైన్ క్లియర్ అయింది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) శుక్రవారం కొట్టివేసింది. ఇక వాదనలు కొనసా గించలేమని న్యాయస్థానానికి మిల్లర్లు తెలిపారు. దీంతో డిఫాల్ట్ మిల్లర్ల నుంచి బకాయి బియ్యాన్ని రాబట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించనుంది.
ఏండ్లుగా బియ్యం పెండింగ్
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లర్లకు ఇస్తే.. దాన్ని మర ఆడించి.. నిర్ణీత పరిమాణంలో తిరిగి బియ్యంగా ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. 2014 నుంచి ఈ కస్టమ్ మిల్లింగ్ విధానం అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,200కుపైగా మిల్లులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి.
అయితే కొన్నేండ్లుగా కొందరు మిల్లర్లు ఒప్పందం ప్రకారం తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడం లేదు. వాటిని పక్కదారి పట్టిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఇలా దాదాపు 28 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వారి నుంచి రావాల్సి ఉంది. దాని విలువ సుమారు రూ. 6,500 కోట్లకు పైనే. ఇలా బియ్యాన్ని ఎగ్గొడుతున్న మిల్లర్లపై రెం డేండ్ల నుంచి పౌరసరఫరాల శాఖ చర్యలకు దిగింది. శాఖ అధికారులు, పోలీసులు ఆయా మిల్లులకు వెళ్లి తనిఖీలు చేయడంతో పాటు డిఫాల్ట్ మిల్లర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 540 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఇప్పటికే హైకోర్టులో చుక్కెదురు
తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ పలువురు మిల్లర్లు ఈ ఏడాది మేలో హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన న్యాయస్థానం.. అదే నెలలో కొట్టివేసింది. దీంతో వారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు.. డిస్మిస్ చేసింది. తాము ఇకపై వాదనలకు ఒత్తిడి తేబోమని న్యాయస్థానానికి పిటిషనర్లు తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తరఫున సీనియర్ అడ్వకేట్లు సిద్ధార్థ లూథ్రా, నరేందర్ హుడాతోపాటు స్టాండింగ్ కౌన్సిల్/ఏవోఆర్ ప్రసన్న వాదనలు వినిపించారు.
ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం!
రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. వారి నుంచి ఆ బకాయి బియ్యాన్ని ఎలాగైనా రాబట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే తనిఖీలు, కేసులు, అరెస్టులతో ఉక్కుపాదం మోపుతున్నది. నిజాయితీగా పనిచేసే మిల్లర్లను ప్రోత్సహిస్తామని.. అక్రమాలకు పాల్పడే వారిని మాత్రం వదిలిపెట్టబోమని తేల్చిచెప్పింది. డీఫాల్ట్ మిల్లర్లకు తాజాగా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.
బాకీ పడ్డ బియ్యాన్ని వెంటనే తిరిగి అందజేయాలని, లేదా దానికి తగ్గ సొమ్మును చెల్లించాలని మిల్లర్లకు మరోసారి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. కస్టమ్ మిల్లింగ్ విధానాన్ని సాఫీగా సాగించుకునేందుకు కృషి చేయాలని, ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది. మిల్లర్ల సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. సీఎంఆర్‌లో, పీడీఎస్ బియ్యంలో అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద బకాయిలు వసూలు చేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించింది. దీంతో డీఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది.