రాహుల్ ఇక మారడు

21-11-2026 | 05:05am
  1. దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు
  2. భారత ఆర్థిక వ్యవస్థపై తప్పుడు ప్రచారం
  3. వచ్చే వంద ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు
  4. తెలంగాణలో బీజేపీ ఆట మొదలైంది
  5. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదే విజయం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): దేశ ప్రతిష్టను దిగజార్చే ఎజెండా తో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మండిపడ్డారు. ‘దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలను అంతర్జాతీయ వేదికలపై రాహుల్ అవమానించడం.. 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమే.

కాంగ్రెస్ పార్టీ ని దేశ ప్రజలు వరుసగా మూడుసార్లు అధికారానికి దూరం చేసినా.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. వాళ్లు మారరు’ అని విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ప్రధాని మోదీపై అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ ‘సెంచరీ డిఫీటెడ్ లీడర్’గా మారారని.. అయినప్పటికీ దేశ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ఆయన అర్థం చేసుకోవడం లేద ని అన్నారు. ప్రధాని మోదీపై రాజకీయ విమర్శలు చేయొచ్చని, కానీ దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం ఏమిటని రాహుల్‌ను ఆయన నిలదీశారు. 

దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ దోస్తీ!

దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే శక్తులతో రాహుల్ గాంధీ చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘దేశం ముక్కలు కావాలని కోరుకునే తుక్డే తుక్డే గ్యాంగ్‌తో కలిసి.. అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. దేశంలోని డబ్బును విదేశాలకు పంపించి భారత వ్యతిరేకశక్తులను ఏకం చేసేందుకు, దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నదన్నారు. ‘మోదీ వారం రోజుల్లో గద్దె దిగుతారంటూ.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మాదిరిగా భారత్ మారుతుందని రాహుల్ వ్యాఖ్యానిస్తున్నారు. ఏ దేశంలోని వాళ్లయినా తమ దేశం ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటారు.. కానీ రాహుల్ ఆలోచనలు వేరుగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. 

రాహుల్‌కు ఆ మాత్రం అవగాహన కూడా లేదు

గతంలో భారత ప్రధాని విదేశాలకు వెళ్తే అప్పులు అడగడానికి వచ్చారనే అభిప్రాయం ఉండేదని.. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం పెరిగిందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘జీ-20, బ్రిక్స్, క్వాడ్, షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్ చురుకైన పాత్ర పోషిస్తున్నది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనిక సామర్థ్యం, శక్తి ప్రపంచ దేశాలకు తెలిసింది’ అని తెలిపారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్ సరెండర్ అయిందంటూ రాహుల్ గాంధీ మాట్లాడటం సరికాదన్నారు. దేశాలు తమ అవసరాలు, ప్రయోజనాలకు తగ్గట్టు  ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరుపుతాయని.. ఆ మాత్రం అవగాహన కూడా రాహుల్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ వేదికల్లో భారత ప్రధానులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండేదో గుర్తుచేసుకోవాలని సూచించారు. ‘విదేశాల్లో డబ్బులు ఇచ్చి వేదికలపై మాట్లాడటం కంటే అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడితే.. మోదీ గురించి, భారతదేశం గురించి గొప్పగా చెప్తారు’ అని రాహుల్‌కు ఆయన హితవుపలికారు.

కాంగ్రెస్ పాలనలో అసమర్థత, అప్రజాస్వామిక విధానాలు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఎలా ఉండేవో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ‘బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. దీన్ని ఓర్వలేక శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే వంద ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే వంద ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు’ అని ఆయన విమర్శించారు. 

తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు 

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని కిషన్‌రెడ్డి అన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో బీజేపీ లేదని విమర్శించే వారు.. రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించిందనే విషయం గుర్తుంచుకోవాలి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అక్రమ సంపాదన, కుటుంబ పాలన, అవినీతి, దోపిడీ విధానాల గురించి తెలిసిన తెలంగాణ ప్రజలు.. ఆ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదు. తెలంగాణలో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అది బీజేపీతోనే సాధ్యం’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ పోరాటాన్ని ప్రారంభించిందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందు బయటపెడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు