రవాణా శాఖతో మారుతి సుజుకి ఒప్పందం
హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు వేస్తూ, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్(Maruti Suzuki India Ltd) తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో మొత్తం 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షా ట్రాక్‌లను (ADTTలు) ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండాపూర్‌లలో, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, మేడ్చల్, నాగోల్‌లలో, అలాగే కరీంనగర్లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో ద్విచక్ర వాహనాలు (TW), తేలికపాటి మోటారు వాహనాలు (LMV), భారీ మోటారు వాహనాల(HMV) డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ట్రాక్‌లలో హై-డెఫినిషన్ కెమెరాలు, RFID సెన్సార్లు, రియల్‌టైమ్ విశ్లేషణ వ్యవస్థలు, సమగ్ర ఐటీ మౌలిక సదుపాయాలు ఉంటాయి. వీటి ద్వారా కేంద్ర మోటారు వాహన నిబంధనలకు (CMVR) అనుగుణంగా, పూర్తిగా కంప్యూటరీకరించిన, ప్రామాణిక విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ మూల్యాంకన ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండేలా రూపొందించబడింది. తద్వారా మానవ ప్రమేయం వల్ల తలెత్తే పక్షపాతాలు, పొరపాట్లకు అవకాశం తగ్గుతుంది.
“తెలంగాణకు రోడ్డు భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. సాంకేతికత వినియోగం, పటిష్టమైన అమలు, మెరుగైన డ్రైవింగ్ పరీక్షల ద్వారా రోడ్లను మరింత సురక్షితంగా మార్చేందుకు మేము కృషి చేస్తున్నాము. రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు కార్ల తయారీ రంగంలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకి భాగస్వామ్యం వహించడాన్ని మేము స్వాగతిస్తున్నామనీ తెలంగాణ ప్రభుత్వం రవాణా కమిషనర్ కె. ఇలంబరితి (ఐఏఎస్) అన్నారు. ఈ కార్యక్రమం గురించి, శ్రీ రాహుల్ భారతి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్పొరేట్ వ్యవహారాలు, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మాట్లాడుతూ, “రోడ్డు భద్రతను నిర్ధారించడంలో డ్రైవర్ నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తుంది.
ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు (ADTTలు) మానవ పక్షపాతానికి తావులేకుండా, లైసెన్సింగ్ ప్రక్రియలో నిష్పక్షపాతాన్ని, పారదర్శకతను తీసుకువస్తాయి. ఇవి డ్రైవర్ల నైపుణ్యాలను కఠినంగా మూల్యాంకనం చేయడంతో పాటు, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ పద్ధతులను ప్రోత్సహిస్తాయి. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో ఇవి అత్యంత కీలకం. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. తెలంగాణలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగస్వాములం కావడం మాకు సంతోషంగా ఉందన్నారు.