‘మామూళ్ల’ మత్తులో.. రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్..!
- స్నేహిత హిల్స్ ఫేస్- యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
- నిబంధనలు గాల్లోకి..!
- రోడ్డును ఆక్రమించి ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు..
- బిల్డర్లకు అధికారుల ‘కవర్’ ప్రొటెక్షన్ సూచనలు..
- రంగంలోకి ఏసీబీ!..
రాజేంద్రనగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): గండిపేట మండలం స్నేహిత హిల్స్(Snehitha Hills) ఫేజ్-1 పరిధిలో అక్రమ నిర్మాణాలు ‘మూడు పూలు ఆరు కాయలు’గా వర్ధిల్లుతున్నాయి. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళుండి చూడలేని కబోదుల్లా మారడంతో, బిల్డర్లు ఏకంగా అధికారులకె సవాలు విసురుతున్నారు. చ ట్టాలను, భవన నిర్మాణ ఆదేశాలను తుంగ లో తొక్కుతూ శరవేగంగా స్లాబులు వేస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నిబంధనలకు పాతర.. రోడ్డు ఆక్రమణ!
స్థానిక బ్రాడ్వే టీ హోటల్, పిస్తా హౌస్ వెనుక భాగంలో నిబంధనలకు పూర్తిగా పాతరేశారు. కనీస సెట్‌బ్యాక్ (ఖాళీ స్థలం) వదలకుండా భవనాలు నిర్మించడమే కాక, ఏకంగా రోడ్డును ఆక్రమించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
టౌన్ ప్లానింగ్ ‘కవర్’ ప్రొటెక్షన్ సూచనలు..
అధికారుల అండ చూసుకునే కొందరు బిల్డర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు స్లాబులు వేసుకుంటూ పోతున్నారు. చుట్టూ కవర్లు కట్టు కుని గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు సాగించాలని స్వయంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందే బిల్డర్లకు ఉచిత సలహాలు ఇస్తున్న ట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొనుగోలుదారుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ సాగుతున్న ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారినట్లు తెలుస్తోంది.
నిఘా పెట్టిన ఏసీబీ..
రాజేంద్రనగర్ సర్కిల్ అధికారుల విచ్చలవిడి అవినీతి వ్యవహారం, అక్రమ నిర్మాణా లపై ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసిబి త్వరలోనే రాజేంద్రనగర్ సర్కిల్లో అక్రమార్కుల గుట్టు రట్టు చేయనున్నట్లు తెలుస్తోంది.