హైదరా‘బ్యాడ్ వెదర్’!
- 160 పాయింట్లకు పడిపోయిన గాలి నాణ్యత
- కాలుష్య కోరల్లో భాగ్యనగరం
- మహానగరానికి దీపావళి సంబురాల పొ(సె)గ
- 410 పాయింట్లకు పెరిగిన వాయు కాలుష్యం
- కొన్ని చోట్ల 600 పాయింట్లు దాటిన కాలుష్య తీవ్రత
- ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- పశ్చిమ ఐటీ కారిడార్‌లో మరింత ఆందోళనకరం
- జనం జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల హెచ్చరికలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): దీపావళి వేళ హైదరాబాద్(Hyderabad)లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఐటీ కారిడార్‌లో ఏక్యూఐ (ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్) భారీగా పెరగడంతో మరో ఢిల్లీగా మారుతోంది. ఐటీ హబ్‌గా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరుగాంచిన భాగ్యనగరంలో ప్రస్తుతం స్వచ్ఛమైన గాలి కరువవుతోంది.
రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంపై దీపావళి పండుగ ప్రభావం పడింది. పలుచోట్ల పెద్దఎత్తున పటాకులు కాల్చడంతో నగరంలో గాలి నాణ్యత భారీగా క్షిణించి కాలుష్యం ఒక్కసారిగా పెరిగింది. గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో ఏక్యూఐలో 160 పాయింట్లకు గాలి నాణ్యత పడిపోయింది. కాలుష్యం మాత్రం 410 పాయింట్లకు చేరినట్లు సమాచారం. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 600 పాయింట్లను దాటడం కాలుష్య తీవ్రతకు అద్దం పడుతోంది.
దీపావళి తర్వాత మరింత దిగజారిన పరిస్థితి..
ఇప్పటికే కాలుష్య సమస్యతో సతమతమవుతున్న హైదరాబాద్‌కు దీపావళి వేడుకలు గాలి నాణ్యతను మరింత దెబ్బతీసింది. పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పటాకులు కాల్చడం కొనసాగింది. బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, సోమాజిగూడ ప్రాంతాల్లో టపాసుల మోతతో గాలిలో పొగ, ధూళి కణాల సాంద్రత పెరిగింది. దీపావళి రాత్రి 9.30 గంటల సమయంలో హైదరాబాద్ నగర సగటు ఏక్యూఐ 509 పాయింట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి.
పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 392 మైక్రోగ్రాములుగా నమోదైంది. సాధారణంగా పేర్కొన్న 60 మైక్రోగ్రాముల పరిమితితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అలాగే పీఎం10 స్థాయులు కూడా 326 మైక్రోగ్రాములకు చేరినట్లు సమాచారం. సాధారణ పరిమితి 100 మైక్రోగ్రాములు కాగా, ప్రస్తుతం నమోదవుతున్న స్థాయులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం ఉదయానికి నగర సగటు ఏక్యూఐ 160 పాయింట్లుగా నమోదైంది.
అయితే గాలి నాణ్యతను అంచనా వేసేందుకు ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏక్యూఐ)ను ఉపయోగిస్తారు. జీరో నుంచి 50 వరకు ఉంటే మంచి గాలిగా పరిగణిస్తారు. 51 నుంచి 100 వరకు ఉంఏట సంతృప్తికరంగా, 101 నుంచి 200 వరకు మోస్తరుగా, 201 నుంచి 300 వరకు ఉంటే పేలవంగా, 301 నుంచి 400 వరకు అత్యంత పేలవంగా, 401 నుంచి 500 వరకు తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ లెక్కన హైదాబాద్‌లో నమోదవులున్న వాయు నాణ్యత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గంటల వారీగా కాలుష్య తీవ్రత వివరాలు..
రాత్రి 8:31 : 321 (అత్యంత ఆందోళనకరం)
రాత్రి 9:01: 542 (ప్రమాదకర స్థాయి)
రాత్రి 9:30: 509 (తీవ్రమైన కాలుష్యం)
రాత్రి 11:01:544 (శిఖరాగ్రానికి చేరిన పొగ)
రాత్రి 11:31 : 410
అర్ధరాత్రి 12:01 : 383
తెల్లవారుజామున 1:01 : 319
ప్రస్తుత పరిస్థితి: 179
(మోస్తరు స్థాయికి తగ్గుముఖం)
శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ప్రకాష్‌నగర్ వంటి ప్రధాన పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో ఒకానొక దశలో ఏక్యూఐ రికార్డు స్థాయిలో 600 పాయింట్లు దాటడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. పటాకుల వినియోగం వల్ల వాతావరణంలో పీఎం 2.5 (సూక్ష్మ ధూళి కణాలు), సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాల సాంద్రత భారీగా పెరిగింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గి చలిగాలులు వీచడంతో, బాణసంచా పొగ భూమికి దగ్గరలోని పొరల్లోనే నిలిచిపోయి నగరమంతటా పొగమంచు ఆవరించింది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు..
గాలిలోని ప్రమాదకర ధూళి కణాలు శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ బాధితులు బయటకు వస్తే తప్పనిసరిగా ఎన్ మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచడం ద్వారా ఇంట్లోకి కాలుష్య గాలి రాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
మరో ఢిల్లీగా హైదరాబాద్..?
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, నిర్మాణ పనుల నుంచి వెలువడే దుమ్ము, రోడ్లపై పేరుకుపోయిన ధూళి, పారిశ్రామిక ఉద్గారాలకు పండుగ కాలుష్యం తోడవడంతో పరిస్థితి చేయి దాటుతోంది. దీపావళి ప్రభావంతో తాజాగా గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రభుత్వం, అధికారులు తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేక పోతే అతి త్వరలోనే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీగా మారే ప్రమాదం ఉందని నిపుణులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తిగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.