రాష్ట్రగీతంపై ప్రైవేటు!
- నేడు అందెశ్రీ ప్రథమ వర్ధంతి
- ప్రార్థన వేళ ‘జయ జయహే’ ఆలపించని ప్రైవేటు స్కూళ్లు
- ప్రభుత్వం జీవో ఇచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు
- పర్యవేక్షించని విద్యాశాఖ అధికారులు
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana) మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన పాట అది! ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన గేయమది! స్వరాష్ట్రంలో ‘రాష్ట్ర గీత’మవుతుందని ఉద్యమ వేళ చెప్పుకున్నా.. పదేండ్లు ఆలస్యంగా అమలులోకి వచ్చింది. అయినా.. ఇప్పటికీ ప్రైవేటు బడుల్లో ‘ప్రార్థన’లో వినిపించడం లేదు.
ప్రభుత్వం జీవో ఇచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు అటుగా చూడటం లేదు. ఉద్యమ సమయంలో గవర్నమెంట్ పాఠశాలలతోపాటు చాలా ప్రైవేటు స్కూళ్లలోనూ ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..’ మార్మోగింది. ఇప్పుడు స్వరాష్ట్రంలో రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందినప్పటికీ ప్రైవేటు బడుల్లో పిల్లలతో యాజమాన్యాలు పాడించడం లేదు.
సంక్షిప్త గీతమున్నా..!
తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో 12 చరణాలతో ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..’ పాటను కవి అందెశ్రీ(Ande Sri) రచించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమ వేదికలపై ఆ పాట నినదించింది. ఎందరికో స్ఫూర్తిని నింపింది. నాడు ఉద్యమ నాయకులు కూడా స్వరాష్ట్రంలో ఈ పాటను రాష్ట్ర గీతం చేసుకుందామని చెప్పా రు.
కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేం డ్లు ఆ ఆలోచన పక్కకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. మళ్లీ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని.. గేయ రచయిత అందెశ్రీతో మా ట్లాడి.. 2024 జూన్ 2న రాష్ట్రావిర్భావ వేడుకల్లో అధికారికంగా ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించారు. 12 చరణాల పూర్తి రూపంతోపాటు, మూడు చరణాల సంక్షిప్త రూపంతో పాట ను విడుదల చేశారు.
జీవో ఇచ్చినా..!
అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ..’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్న ట్లు 2024 జూన్ 2న జీవో 783ను సాధారణ పరిపాలన విభాగం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రాష్ట్రస్థా యి కార్యక్రమాలు, వేడుకలు, అధికారిక ఈవెంట్లలో ఆలపించాలని, ప్లే చేయాలని అందులో పేర్కొంది. విద్యాసంస్థలు, సాం స్కృతిక సంస్థలు, ఇతర సంస్థలు సంబంధిత కార్యక్రమాలు, సమావేశాల్లో రాష్ట్ర గీతాన్ని ప్రోత్సహించాలని, ఆలపించాలని జీవోలో సూచించింది.
గవర్నమెంట్లో ఓకే.. ప్రైవేట్లో నో
స్కూల్ పిల్లలకు జాతీయ గీతంతోపాటు రాష్ట్ర గీతం ఔన్నత్యాన్ని తెలియజెప్పడానికి ఉదయం ‘ప్రార్థన’ సమయంలో వాటిని పాడించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ‘మా తెలుగు తల్లి’ గీతాన్ని గవర్నమెంట్ స్కూళ్లతోపాటు ప్రైవేట్ స్కూళ్లలోనూ ఆలపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ స్థానంలోకి ‘జయ జయహే తెలంగాణ’ పాట కూడా వచ్చి చేరింది. ‘మా రాష్ట్రం మాగ్గావాలె’ అనే ఉద్యమ స్ఫూర్తితో పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ముందుకు వచ్చి పిల్లలతో ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి జైకొట్టించాయి. సగర్వంగా పాడించాయి.
ఆ పాట దాదాపు రెండున్నరేండ్ల కింద అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తింపు అందుకోగా.. ప్రభుత్వ జీవో ప్రకారం అన్ని గవర్నమెంట్ బడుల్లో ఆలపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం వినిపించడం లేదు. రాష్ట్రంలో 11వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటికీ యాజమా న్యాలు ప్రైవేటు వ్యక్తులే అయినప్పటికీ.. విద్యాశాఖ పర్యవేక్షణ, నియంత్రణలో అవి కొనసాగుతాయి. అయితే.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రాష్ట్ర గీతాలాపనను ప్రోత్సహిస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.